భారత పైలట్ కు దుబాయ్ యువరాజు అరుదైన గౌరవం

ప్రాణాలకు తెగించి విమానాన్ని, వందలాది ప్రయాణికులను సురక్షితంగా కాపాడి వార్తల్లో నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ ఇప్పుడు గ్లోబల్ హీరోగా మారారు. ఆయన చూపించిన ధైర్యసాహసాలకు ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత అరుదైన పురస్కారంతో ఘనంగా సత్కరించింది. సెప్టెంబర్ 30వ తేదీన ఫ్లై దుబాయ్ విమానం వందలాది మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానంలో జరిగిన దాడి ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని లీడ్ చేస్తున్నది మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్. ఫ్లైట్ ప్రయాణిస్తున్న సమయంలో, ఎవరూ ఊహించని విధంగా విమానం కాక్పిట్పై ఒక్కసారిగా దాడి జరిగింది. విమానాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించారా లేక మరేదైనా కుట్ర జరిగిందా అన్నది పక్కనపెడితే.. ఆ భయంకరమైన క్షణాల్లో, కాక్‌పిట్‌లో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. దుండగుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఒకవైపు తనపై దాడి జరుగుతున్నా, రక్తమోడుతున్నా సరే విమానం కంట్రోల్స్ కోల్పోకుండా, ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని అత్యంత సురక్షితంగా ఉంచడంలో ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆయన సమయస్ఫూర్తి వల్ల ఒక అతిపెద్ద విమాన ప్రమాదం తృటిలో తప్పింది, వందలాది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ప్రపంచ ఏవియేషన్ రంగంలోనే ఒక సంచలనంగా మారింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను తక్షణ వైద్య సహాయం కోసం ఇజ్రాయెల్ దేశంలోని ఒక హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటన తర్వాత యూఏఈ ప్రభుత్వం మన పైలట్ చేసిన త్యాగానికి చలించిపోయింది. అక్టోబర్ 3న ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో, దుబాయ్ యువరాజు, యూఏఈ ఉప ప్రధాని , రక్షణ మంత్రి అయిన షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వయంగా ఇజ్రాయెల్ వెళ్లి స్మిత్ మచ్చార్‌ను పరామర్శించారు. ఒక అరబ్ దేశానికి చెందిన అత్యున్నత నాయకుడు, యువరాజు స్వయంగా ఇజ్రాయెల్ లోని ఆసుపత్రికి వెళ్లి ఒక భారతీయ పైలట్‌ను పరామర్శించడం దౌత్యపరంగా ఒక అరుదైన దృశ్యం. స్మిత్ మచ్చార్ ధైర్యాన్ని ఆయన స్వయంగా మెచ్చుకుని, యూఏఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇది నిజంగా ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణం.
ప్రయాణికుల భద్రత కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టిన స్మిత్ మచ్చార్ సేవలను గుర్తించిన యూఏఈ ప్రభుత్వం తాజాగా ఆయనకు అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని అందజేశారు. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ స్వయంగా ఈ అవార్డును ప్రదానం చేయడం విశేషం. సాధారణంగా ఈ ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారాన్ని దేశాధినేతలకు, దేశం కోసం అత్యున్నత సేవలు చేసిన వారికి మాత్రమే ఇస్తారు. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవం మన ఇండియన్ పైలట్‌కు దక్కడం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని పెంచింది. పైలట్‌తో పాటు ఆ సమయంలో విమానంలో ఉండి ధైర్యంగా వ్యవహరించిన ఇతర సిబ్బందికి కూడా యూఏఈ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది.



