అమెరికాలో హై అలెర్ట్…ఆ ల్యాబ్ లో అసలేం జరిగింది?

రష్యాలోని చెర్నోబిల్, జపాన్లోని ఫుకుషిమా అణు ప్రమాదాలు మానవాళికి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంటాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన ఘటనే చోటుచేసుకుంది. అమెరికాలోని అత్యంత పకడ్బందీగా, అత్యంత భద్రత మధ్య నడిచే ఒక ప్రతిష్టాత్మక అణు పరిశోధన కేంద్రంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రేడియోధార్మిక పదార్థాలు లీక్ అయ్యాయన్న వార్తలు అమెరికా ప్రభుత్వంతో పాటు, ప్రపంచ దేశాలను సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. క్షణాల్లో అక్కడి సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఏకంగా ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లు, విమానాలు, నదీ రాకపోకలను సైతం అత్యవసరంగా నిలిపివేసి ఆంక్షలు విధించారు.
దక్షిణ కరోలినా రాష్ట్రంలోని అమెరికా ఇంధన శాఖ ఆధ్వర్యంలో నడిచే సవన్నా రివర్ నేషనల్ లాబొరేటరీలో ప్రయోగశాలలోని ఏరియా ఏ విభాగంలో ఉన్న ఒక గదిలో ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. సెన్సార్లు వెంటనే ఎమర్జెన్సీ అలారమ్స్ మోగించాయి. క్షణాల్లో ఆ అగ్నిప్రమాదం జరిగిన గది నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో అక్కడున్న రేడియోధార్మిక పదార్థాలు గాల్లోకి విడుదలయ్యాయన్న ఆందోళన తీవ్రస్థాయిలో వ్యక్తమైంది. ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ WRDW కూడా ఈ అగ్నిప్రమాదం కారణంగా రేడియోధార్మిక కాలుష్యం విడుదలైనట్లు ప్రాథమిక నివేదికలను ప్రసారం చేయడంతో అమెరికా అంతటా ఒక్కసారిగా కలకలం రేగింది. మంటలు చెలరేగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. రేడియేషన్ ముప్పు ఉన్నందున, ప్రయోగశాలలోని ఏరియా ఏ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పరుగులు తీయవద్దని, సుమారు 30 నిమిషాలపాటు అక్కడే సురక్షిత ప్రాంతాల్లో లోపలే ఉండిపోవాలని ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే చర్యల్లో , కార్యకలాపాల నిలిపివేతలో పాల్గొనని ఇతర ఉద్యోగులను కూడా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భవనాల లోపలే ఉండాలని అధికారులు సూచించారు.
ఈ ప్రమాదం ప్రభావం కేవలం ఆ భవనానికే పరిమితం కాలేదు. గాల్లోకి రేడియేషన్ చేరితే అది మేఘాల ద్వారా, గాలి ద్వారా వందల కిలోమీటర్లు వ్యాపిస్తుంది. అందుకే ఫెడరల్ అధికారులు తక్షణమే సవన్నా రివర్ సైట్ పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైలు, నదీ, విమాన రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించారు. అంతేకాకుండా, కేంద్రంలోకి కొత్తగా ప్రవేశించే వాహనాలు, వ్యక్తుల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేసి, సైట్ చుట్టూ భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ కొన్ని గంటల పాటు అమెరికా ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు.
అత్యంత ఆధునిక ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, పీపీఈ కిట్లు ధరించిన ఎమర్జెన్సీ బృందాలు ప్రాణాలకు తెగించి మంటలను అదుపు చేసే ప్రక్రియను వేగవంతం చేశాయి. వారి కృషితో, అగ్నిప్రమాదం జరిగిన రెండు గంటలలోపే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. మంటలు ఆరిపోయిన తర్వాత అత్యంత కీలకమైన రేడియేషన్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తూ, ప్రభావిత భవనం వెలుపల రేడియోధార్మిక కాలుష్యం వ్యాపించినట్లు ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలి నాణ్యతను, వాతావరణ పరిస్థితులను అధికారులు నిశితంగా పర్యవేక్షించారు. రేడియోధార్మిక పదార్థాల విడుదలపై మొదట్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ, భవనం వెలుపల ఎలాంటి కాలుష్యం ఉన్నట్లు నిర్ధారణ కాలేదని తుది నివేదిక స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సవన్నా రివర్ సైట్ దక్షిణ కరోలినాలోని పలు కౌంటీల పరిధిలో ఏకంగా 800 చదరపు కిలోమీటర్లు భారీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అమెరికా ఇంధన శాఖకు చెందిన అతిపెద్ద సముదాయం. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి అమెరికా అణు ఆయుధాలకు కావాల్సిన ప్లూటోనియంను ఇక్కడే ఉత్పత్తి చేసేవారు. ప్రస్తుతం ఇందులోనే సవన్నా రివర్ నేషనల్ లాబొరేటరీ ఉంది. అణు సంబంధిత పర్యావరణ శుద్ధి , కాలుష్య నివారణ, న్యూక్లియర్ వేస్ట్ మేనేజ్మెంట్ లాంటి అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలపై ఈ ప్రయోగశాల పరిశోధనలు నిర్వహిస్తుంది. జాతీయ భద్రత, అణు విజ్ఞాన రంగాల్లో ఈ కేంద్రం అమెరికాకు కీలకమైనది.
మంటలు పూర్తిగా ఆరిపోయి, ఎలాంటి రేడియేషన్ లేదని నిర్ధారించుకున్న తర్వాత.. సవన్నా రివర్ సైట్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాత్రి 9 గంటల 45 నిమిషాలకు అత్యవసర పరిస్థితి ముగిసినట్లు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో విమాన, రైలు రాకపోకలపై విధించిన ఆంక్షలు ఎత్తివేశారు.ఈ ఘటనా స్థలంలో పని చేస్తున్న ఉద్యోగులు అందరూ సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఒక పెద్ద అణు విపత్తు తృటిలో తప్పినట్లయింది. ఏది ఏమైనా, అణు కేంద్రాల్లో ఏ చిన్న లోపం జరిగినా అది మానవాళి మనుగడకే ముప్పు అనే వాస్తవాన్ని ఈ నాలుగు గంటల ఉత్కంఠ మరోసారి గుర్తుచేసింది.



