రూ.1500లతో ముంబైకి వచ్చి..నేడు 10 వేల కోట్ల ఎంపైర్ వరకు..బాలీవుడ్ బాద్ షా ప్రస్థానం

షారుఖ్ ఖాన్..దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమకు, బాలీవుడ్‌కు ఐకాన్ గా వెలుగొందుతున్న వ్యక్తి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు షారుఖ్ ఆరాధ్య దైవం. కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా, కింగ్ ఖాన్‌గా, బాలీవుడ్ బాద్ షాగా అభిమానులు ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు. నవంబర్ 2, 1965న న్యూఢిల్లీలో జన్మించారు షారుఖ్ ఖాన్. ఆయన తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్, తల్లి లతీఫ్ ఫాతిమా. షారుఖ్ తండ్రిది పాకిస్తాన్‌లోని పెషావర్ .. సరిహద్దు గాంధీగా ప్రఖ్యాతి గాంచిన ఖాన్ అబ్ధుల్ గఫార్ ఖాన్ సారథ్యంలో భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. షారుఖ్ తాతగారు ఆఫ్ఘనిస్తాన్లోని పాస్తూన్ తెగకు చెందిన వారు. ఉన్నత చదువుల కోసం 1946లో పెషావర్ నుంచి ఢిల్లీకి వచ్చిన షారుఖ్ తండ్రి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో తనను తాను సగం హైదరాబాదీ, సగం పఠాన్, కొంత కాశ్మీరీగా అభివర్ణించుకుంటారు షారుఖ్. చిన్నతనంలో క్రీడాకారుడు కావాలని షారుఖ్ కలలు కన్నారు. హాకీ, ఫుట్‌బాల్ తదితర క్రీడల్లో సత్తా చాటారు. అయితే భుజానికి గాయం కారణంగా ఆయన కలలన్నీ కల్లలయ్యాయి. అప్పుడే నటన వైపు అడుగులు వేసిన షారుఖ్ ఖాన్ .. సీరియల్స్ లో నటిడిగా తన జర్నీని స్టార్ట్ చేశారు. 1989లో ఫౌజీ అనే టెలివిజన్ సిరీస్‌తో తొలిసారి కనిపించారు. అయితే 1981లో తండ్రి, 1991లో తల్లి చనిపోవడంతో షారుఖ్ ఖాన్ బాగా కుంగిపోయారు. అప్పుడు షారుఖ్ అక్క షహనాజ్ లాలారుఖ్ అండగా నిలిచారు. అందుకే ఆయనకి అక్క అంటే పంచ ప్రాణాలు. అక్కను ఆమె కుటుంబాన్ని ఇప్పటికీ ముంబైలోని తన లగ్జరీ ప్యాలెస్ మన్నత్లోనే ఉంచి చూసుకుంటున్నారు షారుఖ్.
1992లో దీవానా అనే మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. అనంతరం బాజీగర్, డర్, అంజామ్తో పాటు 1995లో వచ్చిన దిల్వాలే దుల్హానియా లే జాయేంగేతో షారుఖ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పరదేశ్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, దేవదాస్, చెక్ దే ఇండియా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్వదేశ్, ఓం శాంతి ఓమ్, చెన్నై ఎక్స్‌ప్రెస్, పఠాన్, జవాన్ సినిమాలతో రికార్డుల్ని తిరగరాశారు. హిందీ చిత్ర పరిశ్రమను దశాబ్ధాలుగా శాసిస్తున్న ఖాన్ త్రయంలో ఒకరిగా.. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు షారుఖ్ ఖాన్. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కేవలం పారితోషికంపైనే ఆధారపడకుండా లాభాల్లో వాటా తీసుకునేలా తన రూటు మార్చారు. ఇక్కడే ఆయన బిజినెస్ ప్రయాణం మొదలైంది. 2002లో తన భార్య, ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌరీ ఖాన్‌తో కలిసి ఆయన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ను స్థాపించారు. ఈ సంస్థే ఇప్పుడు ఆయన వ్యాపారాలకు వెన్నెముకగా నిలిచింది. మై హూ నా, ఓం శాంతి ఓం మొదలుకొని చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, రయీస్, మొన్నటి బ్లాక్ బస్టర్ జవాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. కేవలం సినిమా నిర్మాణంతో ఆగిపోకుండా డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లోకి కూడా ఈ సంస్థ విస్తరించింది. ముఖ్యంగా వీరి రెడ్ చిల్లీస్ VFX విభాగం అయితే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్లో ఉంది. భారీ బడ్జెట్ సినిమాలకు, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను రెడ్ చిల్లీస్ అందిస్తోంది. ఈ బిజినెస్ లో గౌరీ ఖాన్ పాత్ర కూడా అత్యంత కీలకం.
షారుఖ్ ఖాన్ వ్యాపారాలు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయన వేసిన అసలైన కమర్షియల్ మాస్టర్ స్ట్రోక్.. క్రికెట్ . 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు క్రికెట్ టోర్నమెంట్ లో బాలీవుడ్ హీరో పెట్టుబడి పెట్టడం ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు. నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతాతో కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు షారుఖ్. ఆనాడు ఆయన పెట్టిన ఆ పెట్టుబడి, ఇప్పుడు ఐపీఎల్‌లోనే అత్యంత పాపులర్ అండ్ వాల్యూబుల్ బ్రాండ్‌గా ఎదిగింది. క్రికెట్ ను కేవలం ఆటగా కాకుండా ఒక ఎమోషన్ గా, బ్రాండ్ గా మార్చడంలో షారుఖ్ సక్సెస్ అయ్యారు. 2012, 2014, ఆ తర్వాత పదేళ్లకు 2024 సంవత్సరాల్లో KKR ఐపీఎల్ కప్ గెలిచింది. ఈ విజయాలతో ఫ్రాంచైజీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడమే కాకుండా కమర్షియల్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. అక్కడితో ఆగకుండా నైట్ రైడర్స్ గ్రూప్ ద్వారా షారుఖ్ తన క్రికెట్ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, యూఏఈ ILT20లో అబుదాబి నైట్ రైడర్స్, మేజర్ లీగ్ క్రికెట్లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్లను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదే లాస్ ఏంజిల్స్‌లో ఏకంగా నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్ ను ప్రారంభించడం వారి అంతర్జాతీయ విస్తరణలో మరో కీలక అడుగు. గ్లోబల్ టీ20 మార్కెట్లో ఇప్పుడు షారుఖ్ నైట్ రైడర్స్ అనేది ఒక గ్లోబల్ బ్రాండ్. సినిమాలు, క్రికెట్ మాత్రమే కాకుండా బ్రాండ్ పార్ట్నర్షిప్స్, కన్స్యూమర్ వెంచర్లు, రియల్ ఎస్టేట్ ద్వారా కూడా షారుఖ్ ఖాన్ తన సంపదను పదింతలు పెంచుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు. అన్నింటికీ మించి తన కొడుకు ఆర్యన్ ఖాన్‌తో కలిసి లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ D YAVOL ను స్టార్ట్ చేశారు. ఇక ఆయన ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ వాటా చాలా పెద్దది. ముంబైలోని ఆయన ఇల్లు మన్నత్ ఇండియాలోనే అత్యంత ఫేమస్ సెలబ్రిటీ ఇళ్లలో ఒకటి. ఢిల్లీ, లండన్, దుబాయ్, అలీబాగ్‌లలో కూడా ఆయనకు వందల కోట్ల విలువైన ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, షారుఖ్ ఖాన్ నికర ఆస్తి సుమారు 10వేల కోట్లు. 2025లో ఈ అంచనా 12 వేల 490 కోట్లుగా ఉండగా, వాల్యుయేషన్స్, మార్కెట్ పరిస్థితుల వల్ల ఇప్పుడు కాస్త తగ్గింది. ఏది ఏమైనా నటనతో కోట్ల హృదయాలను, వ్యాపారంతో కోట్ల రూపాయలను గెలుచుకున్న షారుఖ్ ఖాన్ నిజంగానే ఒక బాద్ షా.



