ఇండియన్ ఆర్మీ పవర్ …ఉగ్రవాదుల కొత్త ప్లాన్.. ఇంటెలిజెన్స్ బిగ్ అలర్ట్!

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలు ఇప్పుడు పాత పద్ధతులను వదిలేసి, హైటెక్ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నాయి. భారత ఆర్మీ దెబ్బకు చావుదెబ్బ తిన్న పాక్ ఉగ్రవాద సంస్థలు, ఇప్పుడు యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదంలోకి లాగేందుకు ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. ముఖ్యంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ .. తమ అధినేత మసూద్ అజార్ బతికే ఉన్నాడని నమ్మించేందుకు ఏఐ సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలతో డిజిటల్ జిహాద్ కు తెరతీసింది. ఆపరేషన్ సింధూర్ తో ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాద సంస్థలకు భూమి మీద నరకం ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఏకంగా సరిహద్దులు దాటి.. నేరుగా పాకిస్తాన్ లోని బహవల్పూర్లో ఉన్న జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఒకప్పుడు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ నీడలో సేఫ్ గా ఉన్నామని విర్రవీగిన ఉగ్రవాదుల స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ భయంకరమైన దాడుల్లో ఆ సంస్థ అధినేత, భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన మసూద్ అజార్ అత్యంత సన్నిహిత బంధువులతో సహా ఆ సంస్థకు చెందిన పలువురు టాప్-టైర్ కమాండర్లు హతమయ్యారు. ఈ ఆపరేషన్ తర్వాత జైష్-ఎ-మహమ్మద్ సంస్థ కోలుకోలేనంతగా దెబ్బతిని, తీవ్ర ఆర్థిక, నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది.
ఈ దెబ్బకు జైష్ నెట్వర్క్ మొత్తం కుప్పకూలింది. అయితే ఇక్కడే జైష్-ఎ-మహమ్మద్ సంస్థకు ఒక అతిపెద్ద సమస్య వచ్చిపడింది. భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ లాంటి ఆ దాడి తర్వాత మసూద్ అజార్ అదృశ్యమయ్యాడు. మసూద్ అజార్ లాంటి లీడర్ లేకపోవడంతో ఆ సంస్థలో చేరేందుకు యువత ఆసక్తి చూపడం పూర్తిగా మానేశారు. దీంతో నియామకాలు లేక సంస్థ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఈ క్రమంలో క్షీణిస్తున్న కేడర్‌ను మళ్లీ యాక్టివ్ చేసేందుకు జైష్ టెక్నికల్ టీమ్స్ ఒక ఏఐ మాస్టర్ ప్లాన్ వేశాయి. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో ఇస్లామిక్ స్టేట్ , అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మాత్రమే ఈ సైబర్, డిజిటల్ ప్రచారాన్ని ఉపయోగించేవి. లష్కర్-ఎ-తైబా, జైష్ లాంటి సంస్థలు మసీదుల్లో ప్రసంగాలు చేస్తూ, మీటింగ్స్ పెడుతూ కేవలం సంప్రదాయ పద్ధతులపైనే ఆధారపడేవి. కానీ ఇప్పుడు లీడర్షిప్ లేకపోవడంతో జైష్-ఎ-మహమ్మద్ టెక్నికల్ టీమ్స్ సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ అయిన ఏఐ డీప్‌ఫేక్ మార్గాన్ని ఎంచుకున్నాయి. అచ్చుగుద్దినట్లు అతని గొంతుతోనే మాట్లాడే డీప్‌ఫేక్ క్లిప్‌లను వారు తయారు చేస్తున్నారు. ఈ నకిలీ వీడియోల్లో మసూద్ అజార్ పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తూ.. సంస్థలో చేరి ఇండియాకు వ్యతిరేకంగా జిహాద్ చేయాలని పాక్ యువతను రెచ్చగొడుతున్నాడు. ఇవి చూసి నిజంగానే అతను బతికే ఉన్నాడని, యాక్టివ్ గా ఉన్నాడని భ్రమపడి కొందరు యువకులు మళ్లీ ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. దీన్నే నిపుణులు సైబర్ ఉగ్రవాదం , డిజిటల్ జిహాద్ అని పిలుస్తున్నారు.



