షారుక్ రికార్డు బ్రేక్..?విడుదలకు ముందే వారణాసి క్రేజ్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన అప్ కమింగ్ మూవీ కింగ్ , ఓవర్సీస్ లో విడుదలకు ముందే ఒక కనీవినీ ఎరుగని ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఏకంగా వందల కోట్లకు ఆ సినిమా ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అయ్యారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి , మహేష్ బాబు కాంబో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసితో ఈ ఫీట్ రిపీట్ కానుందా అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఓవర్సీస్ మార్కెట్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా షారుక్ ఖాన్ కు విదేశాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పఠాన్, జవాన్ సినిమాలతో వేల కోట్లు కొల్లగొట్టిన షారుక్, ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 175 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్ డీల్. ఇంతటి భారీ ధరకు హక్కులు అమ్ముడుపోవడంతో, ఈ రికార్డును ఇక ఎవరూ బ్రేక్ చేయలేరు అని అనుకుంటుండగా..మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రంగంలోకి దిగింది. సౌత్ నుంచి ఓవర్సీస్ మార్కెట్‌ను దశాబ్దాలుగా శాసిస్తున్న ఏకైక హీరో మహేష్. ఎలాంటి పాన్ ఇండియా అప్పీల్ లేకుండా, కేవలం ప్రాంతీయ చిత్రాలతోనే అమెరికా సహా విదేశీ గడ్డపై అత్యధిక మిలియన్ డాలర్ల మార్కులను అందుకున్న ఏకైక సౌత్ హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. దూకుడు నుంచి గుంటూరు కారం వరకు ప్రతి సినిమాతో ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం మహేష్ కు అలవాటు. అలాంటి మహేష్ బాబుకు ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ తోడైతే, ఆ షారుక్ రికార్డు బద్దలవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఒకప్పుడు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో హిట్టయితే చాలు అనుకున్న మన డైరెక్టర్లు.. ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్లకు సైతం పోటీ ఇస్తున్నారు. అందులో రాజమౌళిది అందరికంటే పైచేయి. ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన ఘనవిజయంతో, ఆ సినిమాకు వచ్చిన ఆస్కార్ అవార్డుతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజాలు సైతం రాజమౌళి మేకింగ్ కు ఫిదా అయిపోయారు.ఇప్పుడు ఆ బ్రాండ్ వాల్యూ మొత్తం మహేష్ బాబు వారణాసి సినిమాకు ప్లస్ అవుతోంది. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఒక ఇండియానా జోన్స్ తరహాలో, అడవుల్లో సాగే భారీ గ్లోబల్ అడ్వెంచర్ గా రాబోతోంది. కేవలం తెలుగు వాళ్లనే కాకుండా, ప్రపంచం మొత్తాన్ని అట్రాక్ట్ చేయడానికి గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా , మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటులను ఈ సినిమాలో కీలక పాత్రల కోసం తీసుకున్నారు. సినిమా స్కేల్, క్యాస్టింగ్ చూస్తుంటే ఇది కచ్చితంగా ఇండియన్ సినిమా హద్దులు చెరిపేసే ప్రాజెక్ట్ అని స్పష్టంగా అర్థమవుతోంది.



