ఒక విషాదానికి సానుభూతి దక్కాలి కానీ అవకాశవాదం కాదు..సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్!

అనంతపురం జిల్లా రాప్తాడులో ఇటీవల జరిగిన ఘటన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. పాఠశాలలో అందరూ చూస్తుండగానే, తరగతి గదిలో ఉన్న ఒక విద్యార్థినిపై ఓ ఉన్మాది అత్యంత కిరాతకంగా రంపం తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. అడ్డుకోబోయిన వారిపై కూడా నిందితుడు దాడికి ప్రయత్నించాడు. ప్రస్తుతం బాధితురాలు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో, పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ హేయమైన, రాక్షసత్వాన్ని తలపించే చర్యను సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఎక్కడినుంచో మొదలైన ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా సినిమాల ప్రభావమే అని, తెరపై రక్తపాతం, వయొలెన్స్ చూపిస్తుండటం వల్లే యువత ఇలాంటి దాడులకు ఇన్స్పైర్ అవుతోందని ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ లాంటి సినిమాల వల్లే సమాజం పాడవుతోందని కొందరు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
సినిమా అనేది సమాజానికి అద్దం పడుతుందా? లేక సమాజమే సినిమాను చూసి చెడిపోతోందా? ఈ డిబేట్ ఈనాటిది కాదు. కానీ ప్రతీ దానికి సినిమా వాళ్లనే టార్గెట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఈ విమర్శలపై సందీప్ రెడ్డి వంగా తన ట్విట్టర్ వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ఎవరైనా ఒక ఘోరమైన నేరానికి పాల్పడినప్పుడు, మొదటి స్పందన సానుభూతి చూపడం మరియు దాని వెనుక ఉన్న పెద్ద సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అయి ఉండాలి. అంతేతప్ప సినిమా రంగంలో ఒక సౌకర్యవంతమైన బలిపశువును వెతుక్కోవడం కాదు.



