ట్రంప్‌ను చంపేందుకు పాకిస్థానీ ఏజెంట్.. అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!

ప్రపంచానికే పెద్దన్నగా ఉన్న అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఆయన చుట్టూ ఉండే భద్రత ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి కట్టుదిట్టమైన భద్రతను ఛేదించి, అగ్రరాజ్య నేత డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని ఓ భారీ కుట్ర జరిగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమైంది. ఈ కుట్ర వెనుక ఉన్నది ఏదో లోకల్ గ్యాంగ్ కాదు, ఏకంగా ఒక దేశపు మిలిటరీ ఏజెన్సీ. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆదేశాల మేరకు పాకిస్థాన్‌కు చెందిన అసిఫ్ మర్చంట్ అనే 48 ఏళ్ల వ్యక్తి, అమెరికాలో అడుగుపెట్టి ట్రంప్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను మట్టుబెట్టాలని మాస్టర్ స్కెచ్ వేశాడు. కానీ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేసిన వలలో ఆ పాక్ ఏజెంట్ చిక్కుకున్నాడు. 2020 జనవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆదేశాల మేరకు, బగ్దాద్‌లో అమెరికా సైన్యం ఒక భారీ డ్రోన్ దాడి చేసింది. ఆ దాడిలో ఇరాన్‌కు చెందిన అత్యున్నత కమాండర్, IRGC లీడర్ ఖాసీం సులేమానీ హతమయ్యాడు. ఆ ఘటన తర్వాత ఇరాన్ రగిలిపోయింది. సులేమానీ హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అప్పట్లోనే శపథం చేశారు. ట్రంప్ సహా అమెరికా ఉన్నతాధికారులను చంపాలనే ఉద్దేశంతో ఇరాన్ ఒక సీక్రెట్ ప్లాన్ రూపొందించింది. దీని కోసం పాకిస్థాన్‌కు చెందిన 48 ఏళ్ల అసిఫ్ మర్చంట్‌ను ఈ మిషన్ కోసం ఎంచుకున్నారు. మతపరమైన యాత్రల కోసం ఇరాన్‌కు వెళ్లిన మర్చంట్‌కు, ఓ బంధువు ద్వారా 2022లో యూసుఫ్ మెర్హర్దాద్ అనే IRGC ఏజెంట్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అతడు స్వచ్ఛందంగా IRGCలో చేరి, ట్రంప్ హత్య కోసం అమెరికా వెళ్లేందుకు ప్రత్యేక ట్రైనింగ్ పొందాడు.



