ఆ సీఎంకు పాకిస్థాన్ ఆఫర్.. లాహోర్ నుంచి వస్తున్న ఆ పిలుపు ఏంటి? భారత్ పర్మిషన్ ఇస్తుందా?

దశాబ్దాలుగా చిరకాల ప్రత్యర్థిగా తన వైఖరితో భారత్ ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని చూసే దేశం పాకిస్థాన్. రెండు దేశాల మధ్య ప్రస్తుత పరిస్తితులైతే అంత బాగోలేవనేది తెలిసిన విషయమే. ముఖ్యంగా పహల్గాం ఎటాక్ తరువాత జరిగిన ఆపరేషన్ సింధూర్ ల తర్వాత మరింత రెండు దేశాల సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఇటువంటి అత్యంత సున్నితమైన వాతావరణంలో, భారతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని సంచలనం తెరపైకి వచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏకంగా పాకిస్థాన్ నుంచి నేరుగా ఆహ్వానం రావడం.. దానికి ఆయన సుముఖంగా ఉండటం.. పాకిస్థాన్ ప్రభుత్వం స్వయంగా మేము వీసా ఇవ్వడానికి సిద్ధం అని ప్రకటించడం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ముఖ్యమంత్రి మరెవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ . నవంబర్ నెలాఖరులో పాకిస్థాన్ లోని లాహోర్ నగరంలో జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ పంజాబీ కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సిందిగా ఆయనకు పాకిస్థాన్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. సాధారణంగా ఒక పౌరుడు పాకిస్థాన్ వెళ్లడానికే వందల రకాల క్లియరెన్సులు కావాలి, అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. అదీ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ ముఖ్యమంత్రి లాహోర్ వెళ్లడం అంటే అది మామూలు విషయం కాదు. భారతదేశంలోని పంజాబ్ , పాకిస్థాన్ లోని పంజాబ్ మధ్య విభజన రేఖ ఉన్నా.. భాష, సంస్కృతి, సెంటిమెంట్ పరంగా వాళ్ల మధ్య ఉన్న బంధం చాలా బలమైనది. సరిగ్గా ఈ పాయింట్ నే బేస్ చేసుకుని నవంబర్ 27 నుంచి పాకిస్థాన్ లోని లాహోర్ వేదికగా పంజాబీ భాష, సంస్కృతిపై ఒక భారీ అంతర్జాతీయ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అక్టోబర్ 23నే ఈ ఇన్విటేషన్ గురించి మీడియాతో మాట్లాడిన సీఎం మాన్.. తనకు ఈ సదస్సుకు వెళ్లాలని ఉన్నప్పటికీ, పాకిస్థాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోచ్ మీడియాతో మాట్లాడుతూ ఒక సంచలన ప్రకటన చేశారు.
అయితే ఇక్కడే పాకిస్థాన్ ఒక వ్యూహాన్ని అమలు చేసింది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చేది లేనిది పూర్తిగా భారతదేశపు అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. మేము ఆహ్వానిస్తున్నాం. మీ ప్రభుత్వమే రానివ్వడం లేదా అనే ఒక నెరేటివ్ ను సెట్ చేయడానికి పాకిస్థాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి ఏ విదేశీ పర్యటన చేయాలన్నా భారత విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ , హోం మంత్రిత్వ శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరి. అందులోనూ పాకిస్థాన్ లాంటి శత్రు దేశానికి వెళ్లాలంటే ఆ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. ఇండియా-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇది ఎంతవరకు ముందుకు వెళుతుందో చూడాలి. భగవంత్ మాన్ కు పాకిస్థాన్ వెళ్లడం పట్ల ఇంత ఆసక్తి ఎందుకు ఉందంటే, దానికి ప్రధాన కారణం అక్కడున్న సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలు. పంజాబీ కల్చరల్ సెంటిమెంట్ పాకిస్థాన్ తో ముడిపడి ఉంది. గతంలో సీఎం మాన్ మాట్లాడుతూ, పరిస్థితులు కనుక అనుకూలిస్తే, పంజాబ్ అసెంబ్లీలోని మొత్తం 117 మంది ఎమ్మెల్యేలతో కలిసి పాకిస్థాన్ లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలని తన మనసులోని కోరికను బహిరంగంగానే బయటపెట్టారు. కర్తార్పూర్ కారిడార్ ద్వారా ఎంతోమంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వెళ్లి వస్తున్నప్పటికీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక హోదాలో వెళ్లడం వేరు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయిన ఈ తరుణంలో, కేవలం కల్చరల్ ఎక్స్ఛేంజ్ పేరుతో పాకిస్థాన్ కు అవకాశం ఇవ్వడానికి ఢిల్లీ ఏమాత్రం సిద్ధంగా లేదు. పాకిస్థాన్ ఒక పక్క ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ, సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు పంపుతూ పంజాబ్ ను అస్థిరపరచాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అదే పంజాబ్ సీఎంను అక్కడికి పంపితే తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. సాంస్కృతిక సంబంధాలు రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించడానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి. కానీ పాకిస్థాన్ తో ఉన్న అసలు సమస్య ఏంటంటే.. ఒక పక్క కల్చరల్ ఈవెంట్స్ అంటూనే మరో పక్క కవ్వింపు చర్యలకు దిగుతుంది. ఇప్పుడు వీసా ఆఫర్ చేయడం కూడా భగవంత్ మాన్ మీద ప్రేమతో కాదు, ఇండియాలో కేంద్రానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఉన్న పొలిటికల్ గ్యాప్ ను వాడుకుని ఒక మైండ్ గేమ్ ఆడటానికి మాత్రమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.



