భూగర్భంలో ఇరాన్ బ్రహ్మాస్త్రం..ఖంగుతిన్న అమెరికా, ఇజ్రాయెల్

ఇటీవల ఇజ్రాయెల్ , అమెరికా దళాలు సంయుక్తంగా చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ కు చెందిన పలు కీలకమైన మిలిటరీ బేస్‌లు, మిస్సైల్ ప్రయోగ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఇరాన్ మిలిటరీ పవర్ తగ్గిపోయిందని అంతా భావించారు. కానీ ఇరాన్ అక్కడితో ఆగిపోలేదు తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని, శత్రువుల కళ్లుగప్పేలా ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ తో ముందుకొచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ రాడార్లు పసిగట్టలేని విధంగా, వారి బాంబులు ఛేదించలేని విధంగా తన మొత్తం మిలిటరీ మౌలిక సదుపాయాలను భూగర్భంలోకి మార్చేస్తోంది. తాజాగా బయటకు వచ్చిన శాటిలైట్ చిత్రాలు పశ్చిమ దేశాల నిఘా వర్గాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా జరిపిన కచ్చితమైన దాడులతో ఇరాన్ మిలిటరీకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. భూమి మీద ఓపెన్ గా ఉన్న ఏ మిలిటరీ స్థావరం కూడా సురక్షితం కాదని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న తమ ఆయుధ కర్మాగారాలను, బాలిస్టిక్ మిస్సైల్ స్థావరాలను అత్యంత సీక్రెట్ గా పునర్నిర్మిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ నివేదికలు, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ లోని రెండు ప్రధాన మిస్సైల్ సైట్లలో భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ కు చెందిన అత్యంత కీలకమైన నాటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ కి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటైన్ వద్ద రాత్రింబవళ్లు నిర్మాణ పనులు సాగుతున్నాయి. తాజాగా బయటపడిన శాటిలైట్ చిత్రాల్లో ఆ పర్వతం వద్ద రోడ్ల విస్తరణ, పటిష్టమైన కాంక్రీట్ ప్రవేశద్వారాలు నిర్మిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ పర్వతం లోపల ఇరాన్ యురేనియం శుద్ధి చేస్తోందా? లేక ఆయుధాలను అసెంబుల్ చేస్తోందా? అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్లను ఇరాన్ తమ అణు కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. దీంతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శత్రు దేశాల శాటిలైట్లను బురిడీ కొట్టించడానికి ఇరాన్ ఒక సరికొత్త టెక్నిక్ వాడుతోంది. మిస్సైల్ లాంచర్లను, ఆయుధాలను తరలించడానికి మిలిటరీ ట్రక్కులకు బదులుగా, సాధారణ పౌర వాహనాల ముసుగులో ఉన్న వాహనాలను వాడుతోంది. దీనివల్ల ఇవి సాధారణ ట్రక్కులా, లేక ఆయుధాలు మోసుకెళ్లే లాంచర్లా అన్నది అమెరికా ఇంటెలిజెన్స్ సైతం సులభంగా పసిగట్టలేకపోతోంది.
ఇరాన్ ఇలా భారీ పర్వతాల కింద స్థావరాలు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈగిల్ 44 పేరుతో ఫైటర్ జెట్లను, క్రూయిజ్ మిస్సైల్స్ ను ఉంచగలిగేంత విశాలమైన అండర్ గ్రౌండ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ను, అలాగే వందలాది డ్రోన్లను దాచిపెట్టే స్ట్రాటజిక్ బేస్ 313 ను ఇరాన్ అధికారికంగానే ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు దెబ్బతిన్న బాలిస్టిక్ మిస్సైల్ ఫెసిలిటీలను కూడా పూర్తిగా ఈ సొరంగాల్లోకే మార్చేస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ కు ఒక అతిపెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. ఒకవేళ భవిష్యత్తులో ఇరాన్ ఫుల్ స్కేల్ యుద్ధానికి దిగితే, ఆ భూగర్భ స్థావరాలను ధ్వంసం చేయడం సాధారణ బాంబుల వల్ల కాదు. అత్యంత శక్తివంతమైన బంకర్-బస్టర్ బాంబులు వేస్తే తప్ప ఆ కాంక్రీట్ కోటలు బద్దలవ్వవు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిందని, ఇప్పటికే తమ స్టాక్ లో ఉన్న విడిభాగాలను ఈ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీల్లో అసెంబుల్ చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఒకపక్క కాల్పుల విరమణ, దౌత్య చర్చల గురించి మాట్లాడుతూనే.. తెరవెనుక ఇరాన్ తన ఏర్పాట్లు తాను చేసుకుంటోంది.
మరోవైపు గ్లోబల్ ట్రేడ్ ను శాసించే చోక్ పాయింట్లపై కూడా ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా పట్టు బిగిస్తోంది. పలు నివేదికల ప్రకారం.. యెమెన్ లోని హౌతీ రెబెల్స్ నియంత్రణలో ఉన్న హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ కోఆర్డినేషన్ సెంటర్ ఒక విచిత్రమైన ఆర్డర్ పాస్ చేసింది. ఎర్ర సముద్రంలోని కీలకమైన బాబ్ అల్-మాండెబ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర నౌకలకు తాము స్వచ్ఛందంగా ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేస్తామని ప్రకటించింది. అంటే గ్లోబల్ ట్రేడ్ రూట్ పై ఒక నాన్-స్టేట్ యాక్టర్ పరోక్షంగా నియంత్రణ సాధిస్తోందన్నమాట. దీనివల్ల అమెరికా , మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. ఇది మాత్రమే కాకుండా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ఇరాన్ కనీసం నాలుగు కమర్షియల్ నౌకలను ఉపయోగించి సముద్రం అడుగున ఉన్న కమ్యూనికేషన్ కేబుళ్ల రూట్లను మ్యాపింగ్ చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. భవిష్యత్తులో గనక అమెరికాతో డైరెక్ట్ వార్ వస్తే, ఈ సబ్-సీ కేబుళ్లను కట్ చేసి ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీయాలన్నది ఇరాన్ మాస్టర్ ప్లాన్ అయి ఉండొచ్చు. అటు ల్యాండ్ మీద మిస్సైల్ సిటీలు, ఇటు సముద్రంలో చోక్ పాయింట్ల మీద కంట్రోల్.. వెరసి ఇరాన్ ఒక మల్టీ-డొమైన్ వార్ ఫేర్ కు సిద్ధమవుతోంది.



