వైట్ హౌస్లో దీపావళి…ట్రంప్ కు హనుమాన్ చాలీసా…ప్రపంచవ్యాప్తమవుతున్న భారతీయ సంస్కృతి

ప్రపంచ దేశాల్లో మన భారతీయులు మన సంస్కృతిని సగర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి పండుగను సెలెబ్రేట్ చేసుకుంటూ భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అత్యంత ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు అమెరికాలో స్థిరపడిన ఎంతోమంది ప్రముఖ ప్రవాస భారతీయులు హాజరై సందడి చేశారు. అయితే ఈసారి జరిగిన వేడుకల్లో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడి అధికారిక గది అయిన ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ తో కలిసి మన భారతీయులు దీపప్రజ్వలన చేయడమే కాకుండా, ఆయనకు మన పవిత్రమైన హనుమాన్ చాలీసా ను బహుమతిగా ఇచ్చారు. ఈ వేడుకల్లో ప్రముఖ హెల్త్ టెక్ కంపెనీ గోక్యూ ఫౌండర్, ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ విశాల్ గొండాల్, ప్రపంచ ప్రఖ్యాత మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, అలాగే మాజీ కెనడియన్ పార్లమెంటేరియన్ రూబీ ధల్లాలతో పాటు పలువురు ప్రముఖ భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ తో కలిసి విశాల్ గొండాల్ సంప్రదాయబద్ధంగా దీపం వెలిగించారు. అనంతరం తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా పవిత్ర గ్రంథాన్ని ట్రంప్ కు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన విశాల్ గొండాల్.. అమెరికా అధ్యక్షుడితో కలిసి దీపావళి జరుపుకోవడం, కోట్లాది మంది భారతీయులు బలం కోసం, ధైర్యం కోసం పఠించే హనుమాన్ చాలీసాను ఆయనకు బహుమతిగా ఇవ్వడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.
విశాల్ గొండాల్ ఈ హనుమాన్ చాలీసాను ఇస్తూ చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఓవల్ ఆఫీస్ లో దీపాలు వెలిగిస్తున్నప్పుడు.. ఇండియా , అమెరికా దేశాల మధ్య స్నేహబంధం మరింత బలపడాలని, చీకటి మీద వెలుగు ఎప్పుడూ విజయం సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, మన పెద్దలు దీవించే జుగ్ జుగ్ జియో అనే సంప్రదాయ ఆశీర్వాదాన్ని ట్రంప్ నకు , ప్రపంచ ప్రజలందరికీ ఆయన అందించారు. జుగ్ జుగ్ జియో అంటే కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అర్థం. అసలు వైట్ హౌస్ లో దీపావళి జరుపుకునే ఈ అద్భుతమైన సంప్రదాయం ఈనాటిది కాదు. 2003లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మొదటిసారిగా ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఐసెన్హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ లో భారతీయ దౌత్యవేత్తలు, ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2009లో అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా దీపావళి వేడుకలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. వైట్ హౌస్ లోని ప్రతిష్టాత్మక ఈస్ట్ రూమ్ లో స్వయంగా దీపం వెలిగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్, రూజ్వెల్ట్ రూమ్ లాంటి అత్యంత కీలకమైన గదుల్లో మన దీపావళి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.



