ఇది తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్…భారీ స్థాయి స్క్రీన్స్ లో వారణాసి రిలీజ్?

తెలుగు సినిమా సత్తాను జాతీయ స్థాయిలో అలాగే ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ప్రపంచవ్యాప్తం చేసిన ఏకైక దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు అంతకుమించి సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో గ్లోబల్ అడ్వెంచరస్ మూవీగా ‘వారణాసి’ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే రాజమౌళి మైండ్ సెట్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియాకే పరిమితం కాలేదు. ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఈ చిత్రాన్ని డబ్ చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూపొందుతోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా అంటార్కిటికా మంచు కొండల్లో, ఆఫ్రికా దట్టమైన అడవుల్లో, అలాగే యూరప్ తదితర విదేశీ లొకేషన్లలో అత్యంత భారీ ఖర్చుతో ఈ సినిమాను చిత్రీకరించారు. ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రాలలో ఇదే అతిపెద్ద యాక్షన్ చిత్రం అని చిత్ర యూనిట్ చెబుతోంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా, అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఈ సినిమాలో కీలక పాత్రల కోసం తీసుకున్నారు. వీరు తోడవడంతో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదనపు మైలేజ్ దక్కడం ఖాయంగా మారింది. షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో, ప్రపంచ స్థాయి వీఎఫ్ఎక్స్ , ఇతర సాంకేతికతలను జోడించే పనిలో పోస్ట్-ప్రొడక్షన్ బృందం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఒకేసారి ప్రపంచంలోని అనేక భాషల్లోకి దీన్ని డబ్ చేస్తున్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో జక్కన్న సినిమాలకు విదేశాల్లో సైతం విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వారణాసి సినిమా విడుదల హక్కులను కొనుగోలు చేయడానికి ప్రపంచ స్థాయి పెద్ద పెద్ద కంపెనీలు క్యూలో ఉన్నాయి. అయితే ఇందులో ప్రపంచ సినీ రంగంలో గొప్ప పేరు సంపాదించిన అతిపెద్ద నిర్మాణ, పంపిణీ సంస్థ అయిన సోనీ అందరికంటే ముందు వరుసలో ఉండటం గమనార్హం. ఈ సోనీ సంస్థ ఇటీవలే రామాయణ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసింది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 వేల స్క్రీన్లలో ఆ చిత్రం విడుదల కావడానికి ప్రధాన కారణం సోనీ పంపిణీ సంస్థే. ఇప్పుడు వారణాసి చిత్రాన్ని కూడా సోనీ సంస్థ పంపిణీ చేయాలని నిర్ణయించుకుందట. దీనిపై ఇప్పటికే చిత్ర నిర్మాతలతో మాట్లాడి పంపిణీ హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. ఒకవేళ సోనీ వారణాసి చిత్రాన్ని పంపిణీ చేస్తే, భారతదేశంలోని మరే ఇతర సినిమాకు లేని విధంగా ఇది ఒక అన్-బిలీవబుల్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. మన తెలుగు డైరెక్టర్, మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచ బాక్సాఫీస్ మీద దండెత్తడానికి ఒక హాలీవుడ్ సంస్థ అండగా నిలవడం నిజంగా తెలుగువారికి గర్వకారణం. వారణాసి సినిమా కేవలం భారతీయులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్న సినిమాగా మారింది. ఈ మహా చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు.



