అనుష్క ఈజ్ బ్యాక్..?ఫ్యాన్స్ వెయిటింగ్

సినిమాలు చేసినా చేయకపోయినా ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్ పాత్రలైనా, యాక్టింగ్ లో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకైనా కేరాఫ్ అడ్రస్ అనుష్క. అయితే గత కొంతకాలంగా ఆన్ స్క్రీన్ మీద స్వీటీ సినిమాలు లేవు, ఆఫ్ స్క్రీన్ లో కనీసం బయట ఫంక్షన్లకు రావడం లేదు.. పోనీ సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివ్ గా ఉందా అంటే అదీ లేదు. అనుష్క లాస్ట్ మూవీ ఘాటీ తర్వాత మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. మూడేళ్ల క్రితం ఒప్పుకున్న మలయాళ పాన్ వరల్డ్ మూవీ కథనార్ ట్రైలర్ వచ్చి 7 నెలలు అవుతున్నా..రిలీజ్ ఊసే లేదు. పైగా మొన్న నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు జరిగితే, కనీసం ఆ సినిమా టీమ్ నుంచి ఒక చిన్న పోస్టర్ కూడా రాకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు స్వీటీ ఈ రేంజ్ లో సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు అభిమానుల నుండి వస్తున్నాయి.
కథనార్ సినిమాను మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో, అత్యంత భారీ బడ్జెట్‌తో వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి తెరకెక్కిస్తున్నారు. మూడేళ్ల క్రితం అనుష్క ఈ సినిమాను అంగీకరించింది. శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క నీల అనే ఒక అత్యంత కీలకమైన, పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇదొక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. ఇండియన్ భాషలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 15 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏడు నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తే రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై చిత్రబృందం ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అనుష్క ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కనీసం నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా అయినా కథనార్ నుంచి ఒక స్పెషల్ పోస్టర్ లేదా క్యారెక్టర్ గ్లింప్స్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. అసలు ఈ ప్రాజెక్ట్ నడుస్తోందా? లేక ఆగిపోయిందా అన్న అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి.



