టార్గెట్ 300 కోట్లు..వృషకర్మ కొట్టేస్తాడా..!

తండేల్ సినిమాతో తన కెరీర్లోనే ఒక సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని నాగ చైతన్య. వరుస ఫ్లాపులకు బ్రేక్ వేయడమే కాకుండా.. ఏకంగా 100 కోట్ల వసూళ్ల మార్కును అందుకున్న తొలి అక్కినేని హీరోగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చైతన్య హీరోగా నటిస్తున్న సినిమానే వృషకర్మ . డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వృషకర్మ రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత బివిఎస్ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథకు అవసరమైన భారీ సెట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ గా నటిస్తున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుంది.
సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపు 100 కోట్లు. అంటే సినిమా హిట్ అయితే సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద సంచలనం సృష్టించాలి. ప్రస్తుతం నాగ చైతన్య ముందున్న టార్గెట్ చాలా పెద్దది. తనకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టే ఈ సినిమాతో కచ్చితంగా 200 నుంచి 300 కోట్లను కొల్లగొట్టాల్సి ఉంటుంది. అప్పుడే నిర్మాతలకు లాభాలు వస్తాయి. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ నడుస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా 45 కోట్లకు కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో, నార్త్ ఇండియాలో ఈ సినిమాకు మంచి మార్కెట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైథలాజికల్ టచ్ ఉన్న కార్తికేయ 2, హనుమాన్ లాంటి సినిమాలు నార్త్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. దానికి తోడు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కార్తీక్ దండు డైరెక్షన్ కాబట్టి హిందీలో కూడా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఒకవేళ వృషకర్మ గనుక 300 కోట్ల టార్గెట్ ను రీచ్ అయితే.. నాగ చైతన్య నెక్స్ట్ చేయబోయే 25వ మైల్ స్టోన్ మూవీకి అది బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది. టాలీవుడ్ కు డిసెంబర్ నెల ఎప్పుడూ ఒక లక్కీ మంత్ లాంటిది. పుష్ప, యానిమల్, సలార్ ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ డిసెంబర్ లోనే వచ్చాయి. ఇప్పుడు నాగ చైతన్య కూడా తన వృషకర్మ సినిమాను డిసెంబర్ 4న గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తండేల్ సక్సెస్ తో ఉన్న ఫామ్ ను కంటిన్యూ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఉన్న నాగ చైతన్య ఇప్పుడు పూర్తి మాస్, యాక్షన్ హీరోగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయాడు. విరూపాక్ష సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్ వర్మ.. ఈసారి మైథలాజికల్ అడ్వెంచర్ తో ఇంకెంత థ్రిల్ ఇస్తాడో చూడాలి.



