టైటానిక్ కూడా సరిపోదు…1000 అడుగుల పెద్ద నౌక..సముద్రంలో ఎందుకు ముంచుతున్నారంటే..?

ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకరమైననౌక ప్రమాదాల్లో టైటానిక్ గురించే చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు అదే సముద్రంలో, ఆ టైటానిక్ కంటే పెద్దదైన, అమెరికా గర్వించదగ్గ ఒక చారిత్రాత్మక నౌక సముద్ర గర్భంలో మునిగిపోబోతోంది. అయితే ఇది ప్రమాదం మాత్రం కాదు.. స్వయంగా అమెరికా ప్రభుత్వమే కావాలని ఈ భారీ నౌకను సముద్రం అడుగున ముంచేయబోతోంది. ఆ నౌకే SS యునైటెడ్ స్టేట్స్.. ఇది మామూలు షిప్ కాదు, అమెరికా నౌకాదళ చరిత్రలో ఒక గోల్డెన్ చాప్టర్. దీని పొడవు అక్షరాలా 1000 అడుగులు అంటే సుమారు 305 మీటర్లు. టైటానిక్ కంటే కూడా ఇది వందల అడుగులు పెద్దది. 1952లో ఈ నౌక తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్లో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటే ప్రయాణాల్లో ఇది సృష్టించిన స్పీడ్ రికార్డును, బ్లూ రిబాండ్ టైటిల్ ను ఇప్పటికీ ప్రపంచంలో ఏ ప్యాసింజర్ షిప్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. అప్పట్లో ఒక ప్యాసింజర్ షిప్ అంత వేగంగా ప్రయాణించడం మామూలు విషయం కాదు. ఇక ఈ నౌక వెనుక ఒక అతిపెద్ద మిలిటరీ సీక్రెట్ ఉంది. దీన్ని నిర్మించింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రచ్ఛన్న యుద్ధం పీక్స్ లో ఉన్న సమయంలో. పైకి ఇది ప్యాసింజర్లను మోసుకెళ్లే లగ్జరీ షిప్ లా కనిపించినా, అత్యవసర సమయాల్లో కేవలం 48 గంటల్లోనే 14 వేల మంది అమెరికా సైనికులను ప్రపంచంలో ఎక్కడికైనా తరలించే ట్రూప్ ట్రాన్స్ పోర్ట్ షిప్ గా కూడా దీన్ని డిజైన్ చేశారు. దీని హల్ డిజైన్ అప్పట్లో టాప్ సీక్రెట్.
ఈ షిప్ లో ప్రయాణించడం కూడా అప్పట్లో ఒక గొప్ప స్టేటస్ సింబల్. జాన్ ఎఫ్ కెన్నెడీ లాంటి అమెరికా అధ్యక్షులు, మార్లిన్ మన్రో లాంటి హాలీవుడ్ సూపర్ స్టార్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో దేశాధినేతలు ఈ షిప్ లో ప్రయాణించారు. దశాబ్దాల పాటు సముద్రాలపై రారాజుగా వెలుగొందిన ఈ నౌక, 1969 నాటికి జెట్ విమానాల రాకతో తన ప్రాభవాన్ని కోల్పోయి రిటైర్ అయింది. కొన్నేళ్లుగా ఫిలడెల్ఫియా పోర్టులో తుప్పు పట్టిపోతున్న ఈ నౌకను పాత ఇనుము కింద స్క్రాప్ కు అమ్మేయడమా? లేక మ్యూజియంగా మార్చడమా? అనే దశాబ్దాల చర్చల తర్వాత అధికారులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక చారిత్రక కట్టడాన్ని కాపాడుకోవడం అంటే దాన్ని భూమి మీద ఉంచడమే కాదు, సముద్రం అడుగున కూడా కాపాడుకోవచ్చని అమెరికా నిరూపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ షిప్ ను కాపాడాలని SS యునైటెడ్ స్టేట్స్ కన్జర్వెన్సీ అనే సంస్థ తీవ్రంగా పోరాడింది. కానీ దీన్ని నిలపడానికి పోర్టు వాళ్లకు అద్దె కట్టడానికే రోజుకు వేల డాలర్లు ఖర్చు అవుతోంది. చివరికి కోర్టు కూడా దీన్ని అక్కడినుంచి తరలించాల్సిందే అని తీర్పు ఇచ్చింది. దాంతో తుక్కుగా కరిగించేకంటే ఒక గొప్ప పనికి వాడాలని ఫ్లోరిడాలోని ఓకలూసా కౌంటీ అధికారులు నిర్ణయించారు. ఈ షిప్ ను గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో ముంచేయాలని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12వ తేదీన ఈ భారీ ఆపరేషన్ జరగబోతోంది. దీనికోసం అక్షరాలా 85 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అసలు ఈ భారీ షిప్ ను ఎందుకు ముంచుతున్నారు అంటే.. సముద్రంలో కృత్రిమ రీఫ్ లను ఏర్పాటు చేయడం కోసం. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర గర్భంలో సహజ పగడపు దీవులు అంతరించిపోతున్నాయి. ఇలాంటి భారీ ఇనుప నిర్మాణాలను సముద్రంలో ముంచితే, కొన్ని నెలల్లోనే వాటి చుట్టూ నాచు, పగడాలు పెరిగి, లక్షలాది చేపలకు, గ్రూపర్, స్నాపర్ లాంటి జలచరాలకు అది ఒక అద్భుతమైన ఆవాసంగా మారుతుంది. మునిగిపోయాక, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ రీఫ్గా రికార్డు సృష్టించబోతోంది. 1950ల నాటి ఈ షిప్ లో విపరీతమైన ఆయిల్, విషపూరితమైన పెయింట్స్, పీసీబీలు , ఆస్బెస్టాస్ లాంటి హానికరమైన రసాయనాలు, వైరింగ్, గ్లాస్ ఉన్నాయి. ఇవన్నీ సముద్రంలో కలిస్తే జలచరాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. అందుకే గత కొన్ని నెలలుగా వందలాది మంది వర్కర్లు ఈ షిప్ ను అణువణువూ శుభ్రం చేశారు. ఏమాత్రం పర్యావరణానికి హాని కలిగించే పదార్థం లేకుండా మొత్తం తీసేసి, ఒక ఖాళీ ఇనుప డబ్బా లాగా మార్చేశారు. దీన్ని ఇప్పుడు ఫ్లోరిడా తీరానికి టోయింగ్ ద్వారా లాగుతున్నారు. అక్కడ ఫ్లోరిడా తీరంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సుమారు 55 మీటర్ల లోతులో ఈ నౌకను అత్యంత జాగ్రత్తగా ముంచుతారు. సముద్ర గర్భంలో ఇది స్థిరంగా నిలబడేలా ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో స్కూబా డైవింగ్ , డీప్ సీ ఫిషింగ్ టూరిజం కు ఇది ఒక అతిపెద్ద గమ్యస్థానంగా మారబోతోంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే డైవర్లు ఈ 1000 అడుగుల భారీ షిప్ లోపలికి వెళ్లి, అక్కడ కొత్తగా ప్రాణం పోసుకున్న సముద్రపు అందాలను వీక్షించవచ్చు. దీనివల్ల ఫ్లోరిడా కౌంటీకి ఏటా మిలియన్ల డాలర్ల టూరిజం ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.



