ఇది మామూలు ప్రేమ కాదు..ఖండాంతరాలు దాటి.. గుడిసెకు చేరిన ప్రేమ!
కామెంట్లు (0)

ప్రేమకు భాష తెలియదు, కులం తెలియదు, మతం తెలియదు.. ఆఖరికి దేశాల సరిహద్దులు, పేదరికం కూడా అడ్డుకాదని నిరూపించింది ఒక విదేశీ యువతి. లగ్జరీగా బతికే ఒక రష్యన్ యువతి.. తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి, ఖండాంతరాలు దాటి, విమానం ఎక్కి.. బీహార్లోని ఒక మారుమూల పల్లెటూరికి చేరుకుంది. ఏసీ గదుల్లో పడుకునే ఆ అమ్మాయి, ఇప్పుడు ఒక పెంకుటింట్లో, పూరి గుడిసెలో తన ప్రియుడితో కలిసి జీవిస్తోంది. బీహార్కు చెందిన రాహుల్ యాదవ్, రష్యాకు చెందిన జూలీల మధ్య చిగురించిన ఈ అద్భుతమైన ప్రేమకథ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే ఈ కథ బీహార్లోని భాగల్పూర్ జిల్లాకు చెందిన ఒక మారుమూల గ్రామంలో మొదలవుతుంది. రాహుల్ యాదవ్ ఒక సాధారణ యువకుడు. అతనిది చాలా పేద కుటుంబం. తలదాచుకోవడానికి సరిగ్గా ఇటుకల ఇల్లు కూడా లేదు, మట్టి గోడలతో కట్టిన ఒక పెంకుటిల్లే వాళ్ళ ప్రపంచం. కుటుంబాన్ని పోషించడం కోసం, నాలుగు రాళ్లు సంపాదించడం కోసం రాహుల్ కొన్నాళ్ల క్రితం రష్యా దేశానికి వెళ్ళాడు. అక్కడ పని చేస్తున్న సమయంలోనే రాహుల్కు జూలీ అనే రష్యన్ యువతితో పరిచయం ఏర్పడింది. మొదట ఒకరికొకరు సాయం చేసుకునే మంచి స్నేహితులుగా మారారు. ఇద్దరి మధ్య భాష ఒక పెద్ద అడ్డంకి. రాహుల్కు ఇంగ్లీష్, రష్యన్ రాదు.. జూలీకి హిందీ రాదు. కానీ ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకున్నారు. ట్రాన్స్లేషన్ యాప్స్ వాడుకుంటూ తమ భావాలను పంచుకునేవారు. స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. మొదట రాహుల్ తన ప్రేమను వ్యక్తపరచగా, జూలీ దానికి అంగీకరించింది. ఇక్కడ రాహుల్ చేసిన గొప్ప పని ఏంటంటే.. అతను జూలీకి ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. తానొక కోటీశ్వరుడినని, తనకు పెద్ద బంగ్లా ఉందని నమ్మించలేదు. తన నిజమైన ఆర్థిక పరిస్థితి గురించి, తను ఉండే ఆ పాత మట్టి ఇల్లు గురించి జూలీకి ముందే నిజాయితీగా చెప్పేశాడు. ఒకవేళ ఏ అమ్మాయి అయినా ఆ పూరి గుడిసెను చూస్తే.. నాకు ఈ దరిద్రం వద్దు అని వెళ్లిపోతుంది. కానీ జూలీ అలా చేయలేదు. ఆమె రాహుల్ బ్యాంక్ బ్యాలెన్స్ చూడలేదు, అతనిలోని నిజాయితీని, అతని మంచి మనసును మాత్రమే చూసింది. నాకు నీ డబ్బూ అవసరం లేదు.. నువ్వుంటే చాలు అంటూ తన ప్రేమను గట్టిగా నిలబెట్టుకుంది. వీరిద్దరి ప్రేమకథలో అసలైన ఘట్టం ఇక్కడే మొదలైంది. రాహుల్ తిరిగి ఇండియాకు వచ్చేశాడు. కానీ జూలీ అతని జ్ఞాపకాలతో రష్యాలో ఉండలేకపోయింది. తన కుటుంబం, స్నేహితులు, పుట్టి పెరిగిన దేశం.. అన్నింటినీ వదిలేసి రాహుల్ కోసం ఇండియాకు బయలుదేరింది. ఒక విదేశీ యువతి తమ ఊరికి, అది కూడా రాహుల్ లాంటి ఒక పేదవాడి ఇంటికి రావడం చూసి ఆ ఊరి జనాలు ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల ఊర్ల నుంచి వందలాది మంది జనాలు ఆ రష్యన్ కోడలిని చూడటానికి గుంపులు గుంపులుగా రాహుల్ ఇంటి ముందు చేరారు. సరిగ్గా అప్పుడే అందరి మైండ్ బ్లాక్ అయ్యే సీన్ జరిగింది. పెద్ద పెద్ద నగరాల్లో, మంచు కురిసే చలిలో పెరిగిన ఆ అమ్మాయి.. ఆ ఊరిలోని పల్లెటూరి వాతావరణానికి, ఆ పేదరికానికి ఎటువంటి ఇబ్బంది పడకుండా వెంటనే అడ్జస్ట్ అయిపోయింది. ఆ పెంకుటింట్లో రాహుల్ పక్కన ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించింది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ప్రేమ ఉంటే మట్టి ఇల్లు కూడా తాజ్మహల్లా కనిపిస్తుంది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? అని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాహుల్, జూలీల వీడియోలే వైరల్ అవుతున్నాయి.


