'డబుల్ క్యాచ్' ప్లాన్ విఫలం: సముద్రంలో కుప్పకూలిన స్పేస్ఎక్స్ బూస్టర్!

అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త అద్భుతాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంస్థ ఎలాన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్ఎక్స్’. అయితే, ఎప్పుడూ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోయే ఎలాన్ మస్క్‌కు తాజాగా ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్ఎక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ ఫ్లైట్ 15 ప్రయోగం బెడిసికొట్టింది. స్టార్‌షిప్ ప్రయోగం అనేది కేవలం అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపడం మాత్రమే కాదు, దాన్ని సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడం కూడా. సాధారణంగా స్టార్‌షిప్ ప్రయోగంలో మొదటి దశ అయిన సూపర్ హెవీ బూస్టర్‌ను ప్రయోగించిన తర్వాత, అది తిరిగి స్టార్‌బేస్‌కు చేరుకోవాలి. రాకెట్ కిందికి వస్తున్నప్పుడు లాంచ్ ప్యాడ్ దగ్గర ఉండే రెండు భారీ మెకానికల్ చాప్‌స్టిక్స్ సాయంతో దాన్ని గాలిలోనే సురక్షితంగా పట్టుకోవడం స్పేస్ఎక్స్ టార్గెట్. అయితే ఈ స్టార్‌షిప్ ఫ్లైట్ 15 మిషన్‌లో ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. బూస్టర్ భూమి మీదకు వస్తున్నప్పుడు మధ్యలోనే అనుకోని టెక్నికల్ సమస్య తలెత్తింది. రాకెట్ గమనం కంట్రోల్ తప్పే ప్రమాదం ఉందని గ్రహించిన శాస్త్రవేత్తలు, లాంచ్ టవర్ వద్ద దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకున్నారు. రాకెట్‌ను నేరుగా జనవాసాల మీద కాకుండా, ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా డైవర్ట్ చేసి మెక్సికో గల్ఫ్ సముద్రంలో ల్యాండ్ చేశారు. దీంతో స్టార్‌షిప్ రాకెట్ రెండు దశలను ఒకే మిషన్‌లో తిరిగి సురక్షితంగా పొందాలన్న స్పేస్ఎక్స్ ప్రణాళికకు గట్టి బ్రేక్ పడింది.
ఇంత భారీ సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్నది స్పేస్ఎక్స్ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా ఏ రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయినా మస్క్ వెంటనే ట్విట్టర్లో స్పందిస్తుంటారు, కానీ ఈసారి ఆయన కూడా పూర్తి డేటా అనాలసిస్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. V3 వెర్షన్ బూస్టర్‌తో లాంచ్ టవర్ క్యాచ్ అనేది స్పేస్ఎక్స్ భవిష్యత్తుకు అత్యంత కీలకం. ఇక బూస్టర్ విఫలమైనంత మాత్రాన ఈ ప్రయోగం మొత్తం ఫెయిల్ అయినట్లు కాదు. కింద బూస్టర్ కూలిపోయినా, స్టార్‌షిప్ పై దశ మాత్రం విజయవంతంగా తన ప్రయాణాన్ని అంతరిక్షంలోకి కొనసాగించింది. ఈ వాహనాన్ని షిప్ 42 గా పిలుస్తున్నారు. ఇది తదుపరి తరం స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకువెళ్లింది. తాజా సమాచారం ప్రకారం ఈ షిప్ 42.. భూమి చుట్టూ సుమారు 14 కక్ష్యలను పూర్తి చేయనుంది. అక్కడ తన మిషన్‌ను కంప్లీట్ చేసిన తర్వాత, ఈ పై దశ తిరిగి స్టార్‌బేస్‌కు చేరుకోవాల్సి ఉంది. నవంబర్ 15న భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు ఈ పై దశను ప్రయోగ టవర్ వద్ద తిరిగి పట్టుకునే ప్రయత్నం చేయనున్నట్లు స్పేస్ఎక్స్ ప్రకటించింది. బూస్టర్ ఫెయిల్ అయినా సరే.. ఈ పై దశను పట్టుకునే ప్రయత్నం గనక విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగ చరిత్రలో మస్క్ మరో కీలక మైలురాయిని చేరుకున్నట్లే.స్పేస్ఎక్స్ చరిత్ర చూస్తే, ఫెయిల్యూర్స్ వారికి కొత్తేమీ కాదు. వాళ్లు ఎన్నిసార్లు రాకెట్లను క్రాష్ చేశారో, అంతకంటే వేగంగా తప్పులను సరిదిద్దుకుని అద్భుత విజయాలు సాధించారు. స్టార్‌షిప్ 15 మిషన్‌లో ఎదురైన ఈ సవాలును కూడా వారు అధిగమించి, తదుపరి ప్రయోగాల్లో రాకెట్‌ను విజయవంతంగా క్యాచ్ చేస్తారని ప్రపంచ సైన్స్ వర్గాలు ఆశిస్తున్నాయి. మార్స్ పైకి మనిషిని తీసుకెళ్లాలన్న మస్క్ కలల ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగుతూనే ఉంటారని అంతర్జాతీయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



