అదరగొట్టిన ధనుష్..ఆసక్తి పెంచేసిన ఓం ట్రైలర్!

ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ ఓం . శివకార్తికేయన్ తో అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వవహించారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 2 నిమిషాలకు పైగా సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ధనుష్ అండర్ కవర్ ఆఫీసర్‌గా విశ్వరూపం చూపించాడు. ఒకవైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సిండికేట్ బాస్‌గా భయపెడుతుంటే, మరోవైపు సాయిపల్లవి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చి ట్రైలర్ రేంజ్‌ను అమాంతం పెంచేసింది. నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ట్రైలర్ మొదలవ్వడమే ఒక ఇంటెన్స్ వాతావరణంతో స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా సామ్రాజ్యం చుట్టూ ఈ ఓం స్టోరీ సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. వందల కోట్ల విలువైన ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపుతాయి. కానీ మాఫియా మూలాలు పట్టుకోవడం ఎవరి వల్లా కాదు. అలాంటి టైమ్‌లో తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు చెందిన ఒక స్పెషల్ ఆఫీసర్ సీన్లోకి ఎంటరవుతాడు. ఆ ఆఫీసరే మన హీరో ధనుష్. ట్రైలర్లో ధనుష్‌ను D-402 అనే అండర్ కవర్ ఆఫీసర్ పళనివేల్గా పరిచయం చేశారు. ధనుష్ భార్య రోజా పాత్రలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కనిపించింది.
ధనుష్, మమ్ముట్టి తొలిసారిగా ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇక ఇప్పటివరకు సాఫ్ట్ పాత్రలు, డ్యాన్సులతో మెప్పించిన సాయిపల్లవి, ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడ్ నిత్యారెడ్డిగా మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా , నటి రేణూ దేశాయ్ కీలక పాత్రల్లో కనిపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఇంత భారీ కాస్టింగ్ ఉండటం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ట్రైలర్లో వచ్చే యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.



