అర్నాబ్, మురసు నుండి కోలుకోక ముందే మరో తుఫాను..నవంబర్ 16 నుంచి తుఫాన్ ప్రభావం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుసగా తుఫానులు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో తరచూ ఏర్పడే వాతావరణ అస్థిరతలు, అల్పపీడనాలు రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. అక్టోబర్ 28వ తేదీన కోనసీమ జిల్లా బండారులంక సమీపంలో ‘అర్నాబ్’ తీవ్ర తుఫాను తీరం దాటింది. భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షాలకు విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వేలాది చెట్లు నేలకూలడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లగా, రూ. 4,563 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అక్టోబర్ తుఫాను గాయాల నుంచి రాష్ట్ర ప్రజలు, యంత్రాంగం తేరుకోకముందే మరో తుఫాన్ ఆంధ్ర తీర ప్రాంతాన్ని తాకింది. అర్నబ్ కోలుకోకముందే నవంబర్ 2-3 తేదీల మధ్య ఒంగోలు సమీపంలో మురసు తుఫాను తీరం దాటింది. నవంబర్ మొదటి వారంలోనే వాతావరణం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనివల్ల 1.47 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో పాటు రూ. 1,919 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అప్పటికే అక్టోబర్ తుఫానుతో నష్టపోయిన రైతులు, ఈ రెండో తుఫానుతో మరింతగా కుంగిపోయారు.గత తుఫానుల ప్రభావం మరచిపోకముందే, ఇక తాజాగా వాతావరణ శాఖ మరో ఆందోళనకర వార్తను ప్రకటించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16 సాయంత్రం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశాయి. దీంతో మరోసారి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి. వరుస తుఫానుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవాలని, మత్స్యకారులు వేటకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక 18న ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 18న ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.



