మునగ ఆకుతో ఊహించని ఆదాయం..ఈ రైతు ఆలోచనకు ఫిదా అయిన కలెక్టర్

నీరు తక్కువగా ఉన్నప్పుడు, రసాయన ఎరువుల ఖర్చు విపరీతంగా పెరుగుతున్నప్పుడు వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవాలో ఒక రైతు ప్రాక్టికల్‌గా చేసి చూపించాడు. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రాజవర్ధన్ రెడ్డి వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా కాకుండా, ఒక పర్యావరణ యజ్ఞంలా చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడితే పంట త్వరగా వస్తుందేమో కానీ, భూసారం నాశనమవుతుందని గ్రహించిన ఆయన.. తన 34 ఎకరాల భూమిలో పూర్తిగా గో ఆధారిత సమీకృత ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారుచేసిన సహజ ఎరువులైన జీవామృతం, ఘన జీవామృతం మాత్రమే వినియోగిస్తున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా రాజవర్ధన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అక్కడ అమలు చేస్తున్న గో ఆధారిత వ్యవసాయ విధానాలు, వివిధ రకాల పంటల సాగు, పశుపోషణ, మునగతో పాటు ఇతర ఉద్యాన పంటల పెంపకాన్ని ఆమె స్వయంగా చూసి అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి లక్షలు వెచ్చించి కెమికల్స్ వాడే బదులు, తమ సొంత ఆవులతో తయారుచేసిన ఎరువుల వల్ల పెట్టుబడి ఖర్చు దాదాపు సగానికి సగం తగ్గిపోయిందని రైతు కలెక్టర్‌కు సంతోషంగా వివరించారు.
రాజవర్ధన్ రెడ్డి ఫామ్‌లో కలెక్టర్‌ను అత్యంత ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. కేవలం పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడమే కాదు, ఆధునిక టెక్నాలజీని కూడా ఆయన అద్భుతంగా వాడుకుంటున్నారు. ఈ సందర్భంగా రైతు ఏర్పాటు చేసిన సౌరశక్తితో పనిచేసే సోలార్ పాలీ టన్నెల్ ను కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు. పంట ఉత్పత్తులను ఎండబెట్టడానికి, సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మునగ తోట పెంచుతున్న రాజవర్ధన్ రెడ్డి.. కేవలం ఆకులను అమ్మకుండా, ఆ సౌరశక్తి సహాయంతో మునగ ఆకుల పొడిని తయారు చేస్తున్నారు. బయట మార్కెట్లో మునగ పొడికి ఎంత డిమాండ్ ఉందో, దానికి ఎంత రేటు పలుకుతోందో మనకు తెలిసిందే. ఇలా వాల్యూ అడిషన్ చేయడం ద్వారా తక్కువ పంటకే అధిక ఆదాయం గడిస్తున్న రాజవర్ధన్ రెడ్డి తెలివితేటలను కలెక్టర్ ఎంతగానో అభినందించారు. ఏ మొక్కను ఎక్కడ నాటాలి, వాటి మధ్య అంతర పంటలుగా ఏయే పంటలను సాగు చేయాలి అన్నదానిపై శాస్త్రీయ అవగాహనతో రైతు ముందుకు వెళ్తున్న తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని ఆమె కొనియాడారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఇతర రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పాత పద్ధతులకే కట్టుబడి ఉండకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆమె సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే పంటల వైపు మళ్లాలని కోరారు. ముఖ్యంగా పప్పుధాన్యాలు , కూరగాయలు, చిరుధాన్యాలు , ఆయిల్‌పామ్ వంటి పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు.



