ఎల్‌నినో కరువును జయించిన ఆయిల్ పామ్ సాగు..మహబూబ్‌నగర్ రైతు స్మార్ట్ వ్యవసాయం

వ్యవసాయంలో విజయం సాధించాలంటే కష్టానికి తగిన కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. సరిగ్గా 2022 సెప్టెంబర్ నెలలో మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామానికి చెందిన రైతు గొల్ల శ్రీనివాసులు , తన నాలుగు ఎకరాల పొలంలో ఆయిల్ పామ్ సాగును ప్రారంభించాడు. సాధారణంగా ఆయిల్ పామ్ తోట చేతికి రావడానికి కనీసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో తోట సంరక్షణపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి, ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరిగింది. చుట్టుపక్కల పొలాలన్నీ ఎండిపోవడం ప్రారంభించాయి. ఆయిల్ పామ్ మొక్కలకు నీరు చాలా అవసరం. కరెక్ట్‌గా దిగుబడి వచ్చే సమయానికి కరువు రావడంతో శ్రీనివాసులు ఏమాత్రం భయపడలేదు. తన పంటను కాపాడుకునేందుకు వెంటనే ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో, నీటిని ఎలా నిల్వ చేయాలో, ఎలా పొదుపుగా వాడాలో ఒక పక్కా సైంటిఫిక్ పద్ధతిని ఎంచుకున్నారు. అదే ఆయన తోటను కరువు నుంచి కాపాడింది.
కరువును జయించడానికి ఆయన ముందుగా తన పొలంలో ఒక ఫారంపాండ్ ఏర్పాటు చేసుకున్నారు. తనకున్న రెండు బోరుబావుల ద్వారా వచ్చే నీటిని నేరుగా పొలానికి వదలకుండా, ఆ కుంటలో నిల్వ చేసుకున్నారు. కుంటలో నిల్వ చేసిన నీటిని డ్రిప్ ద్వారా ప్రతి ఆయిల్ పామ్ మొక్క మొదల్లోకి చుక్కలు చుక్కలుగా, క్రమం తప్పకుండా అందించారు. దీనివల్ల నీటి వృథా అరికట్టడమే కాకుండా, మొక్కకు ఎప్పుడూ తడి ఉండేలా చూసుకున్నారు. అలాగే, ఎరువులను నేరుగా భూమిలో చల్లడం మానేసి ఫెర్టిగేషన్ అంటే నీటిలోనే ఎరువులను కలిపి డ్రిప్ ద్వారా నేరుగా మొక్కల వేర్లకు అందించారు. సరైన పోషకాలు, సరిపడా నీరు అందడంతో.. తీవ్రమైన ఎండల్లో కూడా శ్రీనివాసులు ఆయిల్ పామ్ తోట పచ్చదనంతో కళకళలాడింది. శ్రీనివాసులు పాటించిన ఈ శాస్త్రీయ పద్ధతులు, సమర్థవంతమైన నీటి యాజమాన్యం వల్ల అద్భుతమైన ఫలితాలు అందించింది. ఇప్పటివరకు ఆ నాలుగు ఎకరాల నుంచి ఏకంగా 24 మెట్రిక్ టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి సాధించారు. శ్రీనివాసులు పండించిన గెలలకు టన్నుకు సగటున 18 వేల రూపాయలు ధర లభించింది. అంటే 24 టన్నులకు గాను అక్షరాలా రూ.5 లక్షల 25 వేల స్థూల ఆదాయం వచ్చింది. ఈ నాలుగు ఎకరాల సాగు కోసం ఆయన పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.2 లక్షల 50 వేలు. ఆదాయం నుంచి ఈ ఖర్చులన్నీ మినహాయించగా.. రైతు శ్రీనివాసులకు ఏకంగా రూ.2 లక్షల 75 వేల నికర లాభం చేతికి వచ్చింది. నీళ్లు లేని కరువు టైమ్‌లో పత్తి, వరి వేసిన రైతులు లక్షల్లో నష్టపోతే, శ్రీనివాసులు మాత్రం లక్షల్లో లాభాలు ఆర్జించారు.



