డెమోక్రాట్లకు దొరికిన ఆయుధం..అమెరికా అధ్యక్ష బరిలో 39 ఏళ్ల యువకుడు! ఎవరీ జాన్ ఓస్సాఫ్?

అమెరికా రాజకీయాలు ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్లకు గట్టి దెబ్బే తగిలింది. కాంగ్రెస్ పై పట్టు సంపాదించిన డెమోక్రాట్లు ఇప్పుడు ఏకంగా 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. యంగ్ అండ్ డైనమిక్ అభ్యర్థి కోసం వారు చేసిన అన్వేషణకు ఇప్పుడు తెరపడినట్లు కనిపిస్తోంది. వైట్ హౌస్ రేసులో ఇప్పుడు డెమోక్రాట్లకు దొరికిన ఫస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్.. జాన్ ఓస్సాఫ్ . జార్జియా రాష్ట్రానికి చెందిన కేవలం 39 ఏళ్ల వయసున్న ఈ యువకుడు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం. అమెరికా చరిత్రలోనే తొలి యూదు సెనేటర్ గా రికార్డు సృష్టించిన ఓస్సాఫ్ కు ఏకంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పూర్తి మద్దతు ఇస్తుండటం గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జార్జియాలో జన్మించిన ఆయన.. ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్శిటీ లో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయనొక పదునైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అంతర్జాతీయ మీడియా సంస్థల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలు, రాజకీయ అవినీతి, హ్యూమన్ ట్రాఫికింగ్, యుద్ధ నేరాలపై ఎన్నో సాహసోపేతమైన డాక్యుమెంటరీలు తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో జార్జియా స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయినా.. తన దూకుడుతో, వాక్చాతుర్యంతో యువతను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ ఓటమే ఆయనకు పునాదిగా మారింది. 2021లో రిపబ్లికన్ల కంచుకోట లాంటి జార్జియా నుంచే సెనేట్ కు ఎన్నికై సంచలనం సృష్టించారు. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సైతం జార్జియా నుంచి వరుసగా రెండోసారి సెనేటర్ గా గెలిచి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు.



