మిడిల్ ఈస్ట్ లో కీలక పరిణామాలు..ఇరాన్ రివర్స్ అటాక్..!

ఇరాన్ ఏకంగా ఒక సార్వభౌమ దేశానికి చెందిన అధికారిక సైన్యాన్నే ఉగ్రవాద సంస్థగా ముద్ర వేస్తూ సంచలనానికి తెరలేపింది. అమెరికా, పశ్చిమ దేశాలకు మద్దతుగా నిలుస్తున్న మిత్రదేశాలపై ఇరాన్ ఇప్పుడు లీగల్ వెపన్‌ను ప్రయోగిస్తోంది. ఇటీవల బ్రిటన్‌కు చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఇరాన్..తాజాగా లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనాను టార్గెట్ చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్..అర్జెంటీనా నావికా దళం , వైమానిక దళాన్ని తీవ్రవాద సంస్థలుగా ప్రకటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఇరాన్ ఇప్పుడు అర్జెంటీనా దళాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడానికి స్పష్టమైన కారణం ఉంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ను ఒక ఉగ్రవాద సంస్థగా అర్జెంటీనా ప్రకటించింది. ఐఆర్జీసీ అనేది ఇరాన్ అధికారిక సాయుధ దళాల్లో అంతర్భాగం. అలాంటి ఒక అఫీషియల్ సైన్యాన్ని ఉగ్రవాద జాబితాలో చేర్చడం ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అర్జెంటీనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాల ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, అది ఒక శత్రు పూరిత చర్య అని ఇరాన్ మండిపడింది. అందుకే ప్రతిగా ఇరాన్ కూడా ఇప్పుడు ఏకంగా అర్జెంటీనా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను తీవ్రవాద ముఠాలుగా ప్రకటిస్తూ కౌంటర్ ఎటాక్ చేసింది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే పరిణామాలకు పూర్తిగా అర్జెంటీనా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అయితే లాటిన్ అమెరికాలో ఉన్న అర్జెంటీనా సడన్‌గా ఇరాన్ ఐఆర్జీసీ మీద ఎందుకు ఉగ్రవాద ముద్ర వేసిందనే విషయానికి వస్తే దీని వెనుక అమెరికా ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో, వాషింగ్టన్ మిత్రదేశాలన్నీ ఇరాన్ ఐఆర్జీసీని, హిజ్బుల్లాను తీవ్రవాద సంస్థలుగా ప్రకటించాలని అమెరికా పిలుపునిచ్చింది. దీనిని ఫాలో అవుతూనే అర్జెంటీనా ఆ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనికి అర్జెంటీనా ప్రభుత్వ వర్గాలు చెప్పిన కారణం మాత్రం లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సాయుధ సంస్థకు ఇరాన్ ఆర్మీ పూర్తి మద్దతు ఇస్తోందని, ఆ హిజ్బుల్లా తీవ్రవాదులే 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఆమియా జ్యూయిష్ కమ్యూనిటీ సెంటర్‌పై బాంబు దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఆ కిరాతక దాడిలో ఏకంగా 85 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. దానికి ప్రతీకారంగానే ఇప్పుడు ఇరాన్ సంస్థలను బ్యాన్ చేస్తున్నట్లు అర్జెంటీనా ప్రకటించింది. కానీ ఇరాన్ మాత్రం ఆ 1994 దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచీ వాదిస్తూనే ఉంది. అమెరికా దాని మిత్రదేశాలు వరుసగా తమ సైన్యంపై బ్యాన్ విధిస్తుండటంతో ఇరాన్ ఏమాత్రం భయపడలేదు. పైగా వారికి బుద్ధి చెప్పేందుకు ఇరాన్ 2019లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదే అమెరికా నిర్ణయానికి ప్రతిస్పందనగా ప్రతీకార చర్యల చట్టం . ఈ చట్టం ప్రకారం.. అమెరికాకు మద్దతుగా ఎవరైతే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్‌ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తారో.. ఆయా దేశాల సైన్యాలను ఇరాన్ కూడా ఉగ్రవాద సంస్థలుగానే పరిగణిస్తుంది.సరిగ్గా ఈ చట్టాన్ని ఉపయోగించే ఇరాన్ ఇప్పుడు అర్జెంటీనా ఆర్మీ మీద రివర్స్ యాక్షన్ తీసుకుంది. నవంబర్ మొదటి వారంలో కూడా ఇరాన్ ఇదే చట్టం ద్వారా బ్రిటన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI6, అలాగే రాయల్ నేవీ , రాయల్ ఎయిర్ ఫోర్స్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో పడేసింది.



