అటు శర్మ..ఇటు వర్మ…ఇక ఇండియన్ క్రికెట్ కు ‘వైభవ’మే

భారత క్రికెట్ చరిత్ర ఎప్పుడూ ఒక అద్భుతమైన నవల లాంటిది. ఒక తరం ముగుస్తోంది అనగానే, ఏమాత్రం భయం కలగకుండా మరో కొత్త తరం దూసుకొచ్చి ఆ బాధ్యతలను తమ భుజాలపై వేసుకుంటుంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కాలం నుంచి.. సచిన్, గంగూలీ, సెహ్వాగ్ శకం.. ఆ తర్వాత ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మల వరకు మన క్రికెట్‌కు ఎప్పుడూ లోటు లేదు. అయితే రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలు టీ20ల నుంచి తప్పుకున్న తర్వాత భారత క్రికెట్ భవిష్యత్తు ఏంటి? ఆ ఖాళీని భర్తీ చేసేది ఎవరు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు ముగ్గురు కుర్రాళ్లు తమ బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నారు. అటు శర్మ.. ఇటు వర్మ.. మధ్యలో వైభవం.. వినడానికి ఏదో సినిమా డైలాగ్‌లా ఉన్నా, ఇదే ఇప్పుడు టీమిండియా వాస్తవం. పంజాబ్ పవర్ హిట్టర్ అభిషేక్ శర్మ, హైదరాబాద్ సొగసైన ఆటగాడు తిలక్ వర్మ, బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఈ ముగ్గురూ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు.
ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్, చిన్నప్పటి నుంచే క్రికెట్ వాతావరణంలో పెరిగాడు. అతని తండ్రి రాజ్‌కుమార్ శర్మ స్వయంగా క్రికెట్ కోచ్ కావడంతో, బడికి వెళ్లాల్సిన వయసులోనే బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. చిన్నతనంలోనే తన సహచరుడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి అండర్-14 క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. 2018లో పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్ ప్రమాదంలో పడుతోందని భయపడుతున్న సమయంలో, కరోనా లాక్డౌన్ అతనికి ఒక వరంలా మారింది. ఆ సమయంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. బ్యాట్ స్వింగ్, ఫుట్ వర్క్ పూర్తిగా మార్చుకున్నాడు. రోజూ గంటల తరబడి సిక్సర్లు కొట్టడమే ప్రాక్టీస్ చేశాడు. ఆ కష్టమే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున, భారత జట్టు తరఫున విధ్వంసకర ఓపెనర్‌గా మార్చింది. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయడం అభిషేక్ శైలి. రాబోయే వరల్డ్ కప్‌లో పవర్‌ప్లేలో బౌలర్లను భయపెట్టగల ఏకైక ఆయుధం అభిషేక్. తక్కువ ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. దానికి తోడు అతని లెఫ్ట్-ఆర్మ్ స్పిన్ జట్టుకు ఒక అదనపు బౌలింగ్ ఆప్షన్‌ను ఇస్తుంది.
ఇక మన తెలుగు తేజం తిలక్ వర్మ కథ వింటే కన్నీళ్లు రాక మానవు. హైదరాబాద్‌లో పుట్టిన తిలక్ నేపథ్యం చాలా సామాన్యమైనది. కటిక పేదరికం, నాన్న నంబూరి నాగరాజు ఒక సాధారణ ఎలక్ట్రీషియన్. ఆ సంపాదనతో ఇల్లు గడవడమే కష్టం, ఇక కొడుక్కి క్రికెట్ కిట్ కొనడం అంటే వారికి ఒక కల. అలాంటి పరిస్థితుల్లో గల్లీలో టెన్నిస్ బాల్ తో ఆడుకుంటున్న తిలక్ టాలెంట్ ను కోచ్ సలామ్ బయాష్ గమనించాడు. ఆ పిల్లాడిలోని ఫైర్ ను చూసి తన అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఆర్థిక కష్టాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. తిలక్ కు సరైన భోజనం కూడా లేని రోజులు ఎన్నో. అప్పుడు కోచ్ సలామ్ బయాష్ స్వయంగా తన దగ్గరే ఉంచుకుని కడుపు నిండా భోజనం పెట్టి, బ్యాట్లు కొనిచ్చి ప్రోత్సహించాడు. ఆ ఆకలి, ఆ కసి తిలక్ ను ముంబై ఇండియన్స్ కు ఎంపికయ్యేలా చేశాయి. ఐపీఎల్లో వచ్చిన డబ్బుతో ముందుగా తల్లిదండ్రులకు ఒక ఇల్లు కొనిచ్చాడు. తన ఒత్తిడిని జయించే తత్వం, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే విధానం అతన్ని జాతీయ జట్టులో నిలబెట్టాయి. ఇవాళ ఏకంగా భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎదిగే స్థాయికి చేరుకున్నాడు.
వీరిద్దరికి తోడైన మరో అద్భుతమే వైభవ్ సూర్యవంశీ. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వైభవ్, భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన కుర్ర సంచలనం. క్రికెటర్ కావాలనుకుని పరిస్థితుల వల్ల కాలేకపోయిన తండ్రి సంజీవ్ సూర్యవంశీ కలను, కొడుకు వైభవ్ నిజం చేస్తున్నాడు. కేవలం నాలుగేళ్ల వయసులోనే చేతిలో బ్యాట్ పట్టిన ఈ వండర్ కిడ్.. సరైన అకాడమీ శిక్షణ కోసం రోజూ తన తండ్రితో కలిసి సమస్తిపూర్ నుంచి పాట్నాకు సుమారు 100 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించేవాడు. ఆ అలుపెరగని కష్టం, ఆ చిరుప్రాయంలో అతను చిందించిన చెమట వృథా పోలేదు. కేవలం 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజాల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. అండర్-19 స్థాయిలో వైభవ్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. 2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఒత్తిడిలో కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్‌కు ఒంటిచేత్తో వరల్డ్ కప్ అందించాడు. లిస్ట్-ఎ క్రికెట్లో అయితే కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. ఆసియా క్రీడల్లో కూడా సీనియర్ జట్టుతో పాటు ఆడి స్వర్ణం తీసుకురావడంలో వైభవ్ తన వంతు పాత్ర పోషించాడు. వీరు జట్టులో ఉండటం వల్ల టీమిండియాకు కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చరిత్ర చూసుకుంటే గంగూలీ, యువరాజ్, గంభీర్, రైనా లాంటి ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నప్పుడే భారత జట్టు ఎన్నో ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఓపెనింగ్ లో అభిషేక్, మిడిలార్డర్ లో తిలక్, ఏ స్థానంలోనైనా ఆడే వైభవ్.. ఇలా బలమైన ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ రావడం ప్రత్యర్థి బౌలర్ల లైనప్ ను చెదరగొడుతుంది. వీరి వల్ల కలిగే మరో అతిపెద్ద లాభం ఆల్ రౌండ్ ఆప్షన్. ఈ ముగ్గురూ అద్భుతంగా బౌలింగ్ చేయగలరు. ఇలాంటి ప్రతిభావంతమైన ఆటగాళ్లతో భారత క్రికెట్ దూసుకుపోతోంది.
కామెంట్లు (0)
సంబంధిత వార్తలు

భారీ షాట్లతో విరుచుకుపడిన ఓపెనర్లు…అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ…మూడో టీ 20లో కూడా భారత్ విజయం

భారత క్రికెట్ శిబిరంలో జోష్: బరిలోకి దిగనున్న స్టార్ క్రికెటర్లు బుమ్రా, పంత్!

