వైసీపీకి కంచుకోటలోనే బీటలు... స్థానిక పోరులో టీడీపీ హావా

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన బలమైన ప్రాంతీయ పార్టీలలో ఒకటి. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో 151 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ. ప్రతి పక్షాలు దాదాపుగా ఆ విజయం ముందు ఉనికినే కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేలా చేసిన గెలుపు అది. ఆ తర్వాత 2021 ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, అటు గ్రామీణ సంస్థలైన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ఇటు పట్టణ సంస్థలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. మరి అంతటి విజయాలను అందుకున్న ఈ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు ఏంటి? ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలోనే పార్టీ ప్రస్తుత పరిణామాలు ఎందుకు అంతలా చర్చనీయాంశంగా మారాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు సాధారణమైనేవేం కాదు. మున్సిపల్ కార్పొరేషన్లు 13కి 13 క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీలు 59 కి తాడిపత్రి, మైదుకూరు మినహా 57 గెలుచుకుంది. నగర పంచాయతీలలో 28కి 27 గెలిచింది. పరిషత్ (ఎండీటీసీ, జెడ్పీటీసీ), గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ భారీ ఆధిక్యత కనబరిచింది. ఇక గ్రామ పంచాయతీలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80% పైగా సర్పంచ్ స్థానాలను వైసీపీ మద్దతుదారులు విజయ బావుటా ఎగురవేశారు.. అటు జెడ్పీటీసీ & ఎంపీటీసీలలో కూడా మెజారిటీ జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానాలను సొంతం చేసుకుని అన్ని జిల్లాల పరిషత్ చైర్మన్ పీఠాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఆ ఎన్నికలలో రికార్డు స్థాయిలో నామినేషన్లు ఏకగ్రీవమయ్యాయి. ముఖ్యంగా పరిషత్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ 175.. వైనాట్ కుప్పం.. అంటూ వైసీపీ అధినేత జగన్ డైలాగులు అందరికీ గుర్తుండే ఉంటాయి. శ్రేణుల్లో ఈ డైలాగులతో జగన్ జోష్ నింపే వారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలలోనే గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఢీలా పడింది. ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా భిన్నంగా మారాయి. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలు తమ తమ శక్తులను సిద్దం చేస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి నుండి కోలుకుని మెరుగైందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే పార్టీకి ఎదురుగాలి వీస్తుండడం దీనిని మరింత బలపరుస్తోంది. ఈస్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి ఎదురుగాలి వీస్తోంది. పులివెందుల పురపాలక సంఘం ఎన్నికల్లో 40 వార్డులకుగానూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి 20 వార్డుల్ని ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక ఇప్పుడు నియోజకవర్గంలోని 65 ఎంపీటీసీలకు 64 కూటమికి ఏక గ్రీవం కావడం వైసీపీ శ్రేణులను కలవరపెడుతోంది. నియోజకవర్గంలోని ఏడు ఎంపీపీ పదవులు కూడా కూటమికే దక్కనున్నాయి. ఏడు జడ్పీటీసీ స్థానాల్లో కూటమికి మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తాజాగా వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో పర్యటించారు. పులివెందులలో గూబగుయ్ మనిపించాలని ఆ సౌండ్ రాష్ట్రంలో మోగాలంటూ పులివెందులలో కార్యకర్తల సమావేశంలో అభిమానులకు బూస్ట్ అప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతలోనే వెలువడ్డ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాల సంఖ్య చూశాక వైసీపీ క్యాడర్ కే పరిస్థితులు ఎలా ఉన్నాయనే క్లారిటీ వచ్చేసింది. గూబ గుయ్ మంది ఎవరికో అంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెటైర్స్ వేస్తున్నారు.



