ఆఫ్ఘనిస్థాన్ లో బౌద్ధ ఆనవాళ్లు..పరిరక్షిస్తామంటున్న తాలిబాన్లు

అఫ్గానిస్థాన్ ఒకప్పుడు అత్యద్భుతమైన సాంస్కృతిక వైభవంతో విరిసిల్లిన నేల అయితే గత రెండు మూడు దశాబ్దాలుగా యుద్ధాలతో అక్కడి పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. అక్కడి కళలు, చరిత్ర, సంస్కృతి ఎప్పుడో కనుమరుగైపోయాయని యావత్ ప్రపంచం భావించింది. కానీ, అదే తాలిబన్ల రాజ్యంలో ఇప్పుడు 2 వేల ఏళ్ల నాటి ఒక అద్భుతమైన చారిత్రక సంపద బయటపడుతోంది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఓల్డ్ సిటీలోని 2 వేల ఏళ్ల నాటి చారిత్రక బాలా హిస్సార్ కోట మళ్లీ గత వైభవాన్ని సంతరించుకుంటోంది. ఎన్నో దశాబ్దాలుగా శత్రువుల దాడులకు, యుద్ధాలకు గురై శిథిలావస్థకు చేరుకున్న ఈ కోటలో ఇప్పుడు పురావస్తు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఆ తవ్వకాల్లో బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ ఆరామాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లతో పాటు మొగల్ సామ్రాజ్యానికి చెందిన ఎన్నో కళాఖండాలు వెలుగు చూస్తున్నాయి. అఫ్గానిస్థాన్ స్థానిక దారీ భాషలో బాలా హిస్సార్ అంటే ఎత్తైన కోట అని అర్థం. కాబూల్ నగరంలోని కుహ్-ఎ-షేర్ దర్వాజా పర్వత శ్రేణిపై ఎంతో వ్యూహాత్మకంగా ఈ కోటను నిర్మించారు. భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలిపే వాణిజ్య మార్గంలో ఈ కోట శతాబ్దాల పాటు ప్రధాన రాజకీయ, మత, సైనిక కేంద్రంగా విలసిల్లింది. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నుంచి మొఘల్, బ్రిటన్, సోవియట్, అమెరికా దండయాత్రల వరకు.. సుమారు రెండు వేల ఏళ్లుగా ఈ కోట ఒక అజేయమైన రక్షణ కేంద్రంగా, ఆయుధాగారంగా, కారాగారంగా సేవలందించింది. 1879లో తమ అధికారి హత్యకు ప్రతీకారంగా బ్రిటిష్ దళాలు ఈ కోటలో చాలా భాగాన్ని ధ్వంసం చేశాయి. ఈనాటికీ ఆ కోట ఆవరణలో తుప్పుపట్టిన సోవియట్ యూనియన్ ట్యాంకులు, 2021లో అమెరికా సైన్యం వదిలివెళ్లిన ఆయుధాల శిథిలాలు మనకు దర్శనమిస్తాయి.
శతాబ్దాల యుద్ధాలతో శిథిలమైపోయిన ఈ చారిత్రక కోటను మళ్లీ బతికించడానికి ఆగాఖాన్ ట్రస్ట్ రంగంలోకి దిగింది. ఉద్యానవనాలు, మ్యూజియంతో కూడిన ఒక పురావస్తు పార్క్‌గా దీన్ని మార్చడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలే ఇప్పుడు అఫ్గాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి. 5 వేర్వేరు కందకాల్లో పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో ఊహించని చారిత్రక సంపద బయటపడుతోంది. ప్రధానంగా అఫ్గానిస్థాన్‌లో ఒకప్పుడు బౌద్ధ మతం ఎంతగా విలసిల్లిందో చెప్పడానికి నిదర్శనంగా.. బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ ఆరామాల ఆనవాళ్లు ఇక్కడ బయటపడ్డాయి. వాటితో పాటు క్రీస్తు పూర్వం నాటి పురాతన నాణేలు, ఇస్లామిక్ సిరామిక్స్, నూనె దీపాలు, మట్టి పాత్రలు, కొండపై రాతిలో చెక్కిన ఒక అద్భుతమైన నక్షత్రాకారపు కొలను , సింహాసనం, అందమైన వాల్ పెయింటింగ్స్ తో కూడిన మొగల్ ప్యాలెస్ స్నానపు గదులు కూడా కనిపించాయి. ఈ తవ్వకాల్లో బౌద్ధ ఆనవాళ్లు దొరికాయన్న వార్త బయటకు రాగానే అవి ఎంత వరకు సురక్షితం అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఎందుకంటే, అక్కడ అధికారంలో ఉన్నది తాలిబన్లు. 1996 నుంచి 2001 మధ్య సాగిన తమ మొదటి పాలనలో.. ఇస్లాంకు వ్యతిరేకమంటూ కళాఖండాలను, విగ్రహాలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసిన చరిత్ర తాలిబన్లది. ముఖ్యంగా 2001లో బామియాన్ లోయలో ఉన్న 6వ శతాబ్దం నాటి రెండు భారీ బుద్ధ విగ్రహాలను రాకెట్ లాంచర్లు, డైనమైట్లతో పేల్చేశారు. కాబూల్ మ్యూజియంలోని ఎన్నో పురాతన విగ్రహాలను ముక్కలుముక్కలు చేశారు. కానీ, 2021లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబన్ 2.0 వర్షన్ మాత్రం పూర్తి డిఫెరెంట్ గా ఉంది. చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక సంపదను కాపాడేందుకు వారు ఇప్పుడు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. తాలిబన్లలో నిజంగానే మార్పు వచ్చిందా? లేక ఇదంతా ఐక్యరాజ్యసమితి నిధుల కోసం, అంతర్జాతీయ గుర్తింపు కోసం వేస్తున్న నాటకమా? తాలిబన్ల సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖుబైబ్ ఘుఫ్రాన్ ఈ విషయంపై చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. గత నాగరికతల అవశేషాలను మేము విలువైనవిగా భావిస్తున్నాం. దేశంలోని పురాతన ప్రదేశాల పరిరక్షణ ప్రాముఖ్యతను మేము గుర్తించాం. భవిష్యత్ తరాలకు ఈ చారిత్రక సంపదను అందిస్తాం. బాలా హిస్సార్ లాంటి స్మారక కట్టడాలను పునరుద్ధరించడానికి తాలిబన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన అధికారికంగా ప్రకటించారు. అఫ్గానిస్థాన్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ వారిని పక్కనపెట్టాయి. ఈ పరిస్థితుల్లో కనీసం తమ చారిత్రక సంపదను రక్షించుకోవడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చని, విదేశీ ఎన్జీవోల నుంచి ఫండ్స్ సాధించి అంతర్జాతీయ సమాజం దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవచ్చని తాలిబన్లు ఈ మాస్టర్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.



