బలూచిస్థాన్ లో సొంత పౌరులపైనే పాక్ సైన్యం దారుణం

బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా జిల్లాలో పాక్ సైన్యం మరో దారుణానికి ఒడిగట్టింది. మిలిటరీ ఆపరేషన్ పేరుతో సొంత పౌరులపైనే బాంబులు, ఫిరంగులతో దాడులకు తెగబడింది. పాకిస్థాన్ మిలిటరీ చేసిన ఈ దాడుల వల్ల క్వెట్టా జిల్లా పరిధిలో నివసిస్తున్న సుమారు 300కు పైగా మష్వానీ గిరిజన కుటుంబాలు ప్రాణ భయంతో తమ పూర్వీకుల ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది. సొంత సైన్యమే తమ ఊరిపై భారీ ఆయుధాలతో విరుచుకుపడుతుండడంతో గర్భిణీలు, పసిపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులను ఏరిపారేస్తాం అని చెబుతూ పాకిస్థాన్ సైన్యం ఎప్పుడూ అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంటుంది. తరతరాలుగా తమ సంస్కృతిని కాపాడుకుంటూ బతుకుతున్న అమాయక మష్వానీ గిరిజన కుటుంబాలను రోడ్డున పడేసింది. ఆర్మీ ప్రయోగించిన బాంబులకు అనేక గిరిజన ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కళ్ల ముందే తమ బంధువులు చనిపోవడం, ఇళ్లు పేలిపోతుండటం చూసిన ఆ 300 కుటుంబాలు ప్రాణ భయంతో తమ ఊర్లను ఖాళీ చేశాయి. క్వెట్టాకు నైరుతి దిశలో ఉన్న పాంజ్పాయ్ పరిధిలోని కిల్లీ ముహమ్మద్ ఖైల్ అనే ప్రాంతానికి వలస వెళ్లి తలదాచుకున్నాయి.
మిలిటరీ దాడుల వల్ల రోడ్డున పడ్డ ఆ 300 మష్వానీ గిరిజన కుటుంబాల పరిస్థితి ఇప్పుడు వర్ణనాతీతం. ఆ ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి, దానికి తోడు భయంకరమైన చలిగాలి వీస్తోంది. ఉండడానికి నీడ లేక కడుపు నిండా తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు పారిపోయి వచ్చిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు, నడవలేని వయసులో ఉన్న వృద్ధులే ఉన్నారు. వర్షంలో తడుస్తూ ప్లాస్టిక్ టార్పాలిన్ కవర్ల కింద ఆ వృద్ధులు పడుతున్న నరకయాతన స్థానిక బలూచ్ జర్నలిస్టులను సైతం కంటతడి పెట్టిస్తోంది. వాళ్లకు కనీస వైద్య సహాయం అందించడానికి కూడా పాక్ మిలిటరీ అంగీకరించడం లేదు. ఒకవైపు ఆకలి దప్పులు, మరోవైపు చలి వల్ల ఆ చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. బలూచిస్థాన్‌లో ఒక జాతిని నిర్మూలించడానికి పాక్ ప్రభుత్వం చేస్తున్న ఒక చీకటి కుట్రలో ఈ మష్వానీ గిరిజనులు ఇప్పుడు బలిపశువులు అయ్యారు. ఈ దారుణకాండపై బలూచిస్థాన్ స్థానిక రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ బలవంతపు గెంటివేతను పష్తున్వా నేషనల్ అవామీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్ర దాడులు జరిగినంత మాత్రాన, ఒక ఊరిని ఊరినే బాంబులతో పేల్చేసి, తరతరాలుగా అక్కడే జీవిస్తున్న గిరిజనులను వెళ్లగొట్టడం సైనిక రాక్షసత్వమే అని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన కుటుంబాలకు అత్యవసర ఆహారం, టెంట్లు, హెల్త్‌కేర్ అందించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఆ గిరిజన కుటుంబాలు మళ్లీ సురక్షితంగా, గౌరవప్రదంగా వారి పూర్వీకుల ఇళ్లకు తిరిగి వెళ్లేలా భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బలూచిస్థాన్ అనేది పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్.. కానీ అక్కడ జనాభా చాలా తక్కువ. ఆ భూమి అడుగున అపారమైన ఖనిజ సంపద , చమురు నిక్షేపాలు ఉన్నాయి. బలూచ్ ప్రజలు, గిరిజనులు ఉంటే.. తమ భూములను వాళ్లు చైనా ప్రాజెక్టులకు ఇవ్వరని పాక్ ఆర్మీకి తెలుసు. అందుకే ఏదో ఒక ఉగ్రవాద దాడిని సాకుగా చూపి, ఆ ప్రాంతం మొత్తంపై బాంబులు వేసి, భయపెట్టి ప్రజలను ఖాళీ చేయించడం తర్వాత ఆ భూములను ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత చైనా కంపెనీలకు ధారాదత్తం చేస్తుంది. బలూచ్ జాతిని వాళ్ల సొంత గడ్డ మీద మైనార్టీలను చేయడానికి పాకిస్థాన్ ఎస్టాబ్లిష్మెంట్ పన్నుతున్న ఈ భయంకరమైన కుట్ర వల్లే ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. క్వెట్టాలో కట్టుబట్టలతో రోడ్డున పడ్డ ఆ 300 మష్వానీ కుటుంబాల ఆక్రందనలు అంతర్జాతీయ సమాజం చెవులకు వినిపించడం లేదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గాజా మీద, ఉక్రెయిన్ మీద స్పందించే గ్లోబల్ మీడియా, బలూచిస్థాన్ అరాచకాలపై మాత్రం ఎందుకిలా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.



