ఇరాన్ పై అణు దాడికి అమెరికా రెడీ..భారత్ పై ప్రభావం..?

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఏకంగా అణుదాడి స్థాయికి చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతుందనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ అణు కార్యక్రమం ఎప్పుడూ పాశ్చాత్య దేశాలకు ఒక మిస్టరీగానే ఉంటూ వస్తోంది. ఇరాన్ లోని అత్యంత కీలకమైన నటాంజ్ అణు సంక్లిష్ట కేంద్రానికి అత్యంత సమీపంలోనే పిక్‌యాక్స్ పర్వతం ఉంది. అంతర్జాతీయ నిపుణుల అంచనా ప్రకారం, ఈ పర్వతం లోపల భూమికి సుమారు 100 మీటర్ల అంటే 300 అడుగుల లోతులో ఇరాన్ ఒక భారీ సొరంగాల సముదాయాన్ని నిర్మించింది. సాధారణ బాంబులు, క్షిపణులు ఈ పర్వతాన్ని ఏమాత్రం చీల్చుకుని లోపలికి వెళ్లలేవు. ఇరాన్ తన అత్యంత రహస్య అణు శుద్ధి కార్యక్రమాలను, యురేనియం ఎన్రిచ్ మెంట్ ను ఈ పర్వత లోతుల్లోనే అత్యంత భద్రంగా కొనసాగిస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ బంకర్లను నాశనం చేయాలంటే వ్యూహాత్మక అణుదాడి లేదా బంకర్ బస్టర్ బాంబులు వాడటం తప్ప వేరే దారి లేదు.
గతంలో ట్రంప్ ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవాల్సి రావచ్చు అని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అవసరమైతే కేవలం గంటలోనే దాడి చేసి ఆ కేంద్రాలను నాశనం చేయగలమని ఆయన తాజాగా పేర్కొనడం ఈ అణుదాడి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. దీనికి తోడు ప్రముఖ అమెరికన్ కన్జర్వేటివ్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పెడుతున్న విపరీతమైన ఒత్తిడి కారణంగానే అమెరికా ఇరాన్‌పై అణుదాడికి సిద్ధమవుతోందని ఆయన ఓపెన్ గానే ఆరోపించారు. దీనిపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా, తెరవెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం మహా వినాశనానికి సంకేతాలు ఇస్తున్నాయి.



