హర్మూజ్ జలసంధిలో భారత్ కు ఇరాన్ స్పెషల్ పవర్

హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక జల మార్గాలలో ఒకటి. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ సముద్ర మార్గంలో ఇతర దేశాల వాణిజ్య నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించినప్పటికీ, ఇప్పుడు భారత్ సహా తమ మిత్ర దేశాల నౌకలకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ అధికారికంగా ప్రకటించారు. ఆయన ప్రకటన ప్రకారం.. ఇతర దేశాల వాణిజ్య నౌకలపై ఉన్న ఆంక్షలు ఈ నాలుగు దేశాలకు వర్తించవు. ఇకపై భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలు హర్మూజ్ జలసంధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా దాటవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. ఇకపై ఆయా దేశాల నౌకలు జలసంధిలో స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి. అమెరికన్లు కూడా ఆ నౌకలను అడ్డుకోరు అని అమీర్ హయత్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. అయితే ఈ ప్రయాణానికి ఉచితంగా పర్మిషన్ ఇవ్వలేదు, ఆయా దేశాల నౌకల నుంచి రవాణా రుసుమును మాత్రం ఇరాన్ కచ్చితంగా వసూలు చేస్తుంది.
ఇరాన్ కు మిగతా దేశాలతో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, మెడికల్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో వాళ్లకు మద్దతుగా నిలిచే దేశాలు చాలా అవసరం. అందుకే ఇరాన్ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు దోహదం చేస్తాయనే ఏకైక కారణంతోనే ఈ మినహాయింపులు ఇచ్చినట్లు ఇరాన్ ఓపెన్ గానే చెబుతోంది. భారత్ ను ఈ లిస్ట్ లో ఎందుకు పెట్టారంటే.. గ్లోబల్ ఫార్మసీగా పేరున్న మన భారతదేశం నుంచి పశ్చిమాసియా దేశాలకు, ముఖ్యంగా ఇరాన్ కు ఔషధాల దిగుమతిని, సరఫరాను సులభతరం చేసే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ లో రోజుకు మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల ఆయిల్ రవాణా జరుగుతుంది. ఈ మార్గంలో ఇరాన్ ఆంక్షల వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటోంది. కానీ ఇండియా మాత్రం మిడిల్ ఈస్ట్ దేశాలతో నడుపుతున్న చురుకైన దౌత్య విధానాలతో ఇక్కడ క్లియర్ గా వర్కౌట్ అయింది. ఒకవైపు అమెరికాతో మంచి సంబంధాలు నెరుపుతూనే మరోవైపు ఇరాన్ లాంటి దేశాలతో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇండియా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఈ కొత్త మినహాయింపు వల్ల భారతీయ షిప్పింగ్ కంపెనీలకు, ఎగుమతిదారులకు హర్మూజ్ జలసంధిలో పెద్ద ఊరటనే చెప్పుకోవచ్చు. ఇక వాణిజ్య రుసుము చెల్లించినా సరే, మన సరుకులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఎంత పెద్ద యుద్ధం జరిగినా సరే, అందరికీ అవసరమైన మెడిసిన్స్, ఆహారం సప్లై చేయగలిగే కెపాసిటీ ఉన్న దేశాలను ఎవరూ అడ్డుకోలేరు. భారత్ కు ఇరాన్ ఇచ్చిన ఈ మినహాయింపు మన దౌత్య విజయానికి, మన ఫార్మా ఇండస్ట్రీ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.



