జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా ఆ నేత కుమార్తె వివాహం..!

బీహార్ కు చెందిన బాహుబలి ఎమ్మెల్యే, జేడీయూ మాజీ నేత అనంత్ సింగ్.. తన చిన్న కూతురు శివాంగి సింగ్ వివాహాన్ని ఒక రేంజ్లో ప్లాన్ చేశారు. నవంబర్ 25న ఈ కనీవినీ ఎరుగని వివాహ వేడుక జరగబోతోంది. ఈ రేంజ్లో కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్న అనంత్ సింగ్, ఆ పెళ్లి జరిగిన కరెక్ట్‌గా వారం రోజులకే జైలుకు వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అనంత్ సింగ్ ఇంత ఆర్భాటంగా పెళ్లి చేస్తున్నారు. మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అనంత్ సింగ్.. బీహార్ రాజకీయాల్లో ఒక పవర్ఫుల్ బాహుబలి లీడర్. తన చిన్న కూతురు శివాంగి సింగ్ పెళ్లికి ఆయన సిద్ధం చేసిన అతిథుల జాబితా ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పెళ్లికి హాజరు కావాలంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ , ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, రియల్ హీరో సోనూ సూద్ లాంటి దిగ్గజాలకు ఆయన ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. అంతేకాదు, భారత్ నుంచే కాకుండా పాకిస్థాన్‌లోని తన పాత పరిచయస్తులకు కూడా కార్డులు పంపుతున్నానని అనంత్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఈ పెళ్లి వేడుక కోసం ఏకంగా ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతం నుంచి స్పెషల్ డెకరేటర్లను రంగంలోకి దించారు. వివాహ మండపం మొత్తం విదేశాల నుంచి ప్రత్యేకంగా విమానాల్లో తెప్పించిన అరుదైన పూలతో అలంకరిస్తున్నారు. ఇక అసలు హైలైట్ ఏంటంటే.. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా బార్హ్ మైదానంలో ఒక భారీ గుర్రపు పందెం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మేలు జాతి గుర్రాలు ఈ పందెంలో పాల్గొంటాయి. ఇందులో గెలిచిన గుర్రం యజమానికి ఏకంగా ఒక మహీంద్రా థార్ కారును, రెండో స్థానంలో నిలిచిన వారికి ఒక ఖరీదైన మోటార్ సైకిల్‌ను బహుమతులుగా అందించనున్నారు. ఇక రాత్రికి ముంబై , భోజ్‌పురి కళాకారులతో భారీ డ్యాన్స్, మ్యూజిక్ షోలు ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది.. ఇంత ఆర్భాటం చేస్తున్నా, పర్యావరణ పరిరక్షణ కోసం బాణసంచా కాల్చడాన్ని మాత్రం పూర్తిగా నిషేధించారు. సౌండ్ పొల్యూషన్ లేకుండా వేడుక జరగాలన్నది ఆయన ఆర్డర్.ఒకవైపు పెళ్లి సందడి ఇంత గ్రాండ్‌గా జరుగుతుంటే.. మరోవైపు అనంత్ సింగ్ పొలిటికల్ లైఫ్, ఆయన భవిష్యత్తు మాత్రం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకప్పుడు బీహార్ రాజకీయాలను శాసించిన ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఇప్పుడు వేగంగా పడిపోతోంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో జేడీయూ అధిష్ఠానం ఆయనను ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరించింది. స్వయంగా నితీష్ కుమార్ పార్టీ నుంచే ఆయనను గెంటేయడం బీహార్ పాలిటిక్స్‌లో పెద్ద సెన్సేషన్.దీనికి తోడు ఆయన మెడపై ఇప్పుడు ఒక బలమైన న్యాయపరమైన ఉచ్చు బిగుసుకుంది. ప్రముఖ దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన డిసెంబర్ 1న పోలీసుల ఎదుట లొంగిపోవాలని కఠినమైన డెడ్‌లైన్ విధించింది. అంటే నవంబర్ 25న అంగరంగ వైభవంగా కూతురి పెళ్లి చేసిన ఆరో రోజుకే.. ఆయన తన ఇంటి నుంచి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయాల్లో నేతలు ఎప్పుడూ తమ పవర్ తగ్గలేదని ప్రజలకు, ప్రత్యర్థులకు చూపించుకోవాలని ఆరాటపడతారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, నా మీద మర్డర్ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా.. నా సత్తా తగ్గలేదు, నాకున్న బలం తగ్గలేదు, ప్రజల్లో నాకున్న ఫాలోయింగ్ తగ్గలేదు అని అధికార పార్టీకి ఒక బలమైన మెసేజ్ ఇవ్వడానికే అనంత్ సింగ్ ఈ పెళ్లిని ఒక వేదికగా వాడుకుంటున్నారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.



