తుఫాన్ దెబ్బకు తడిసిన పంట.. వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలను కాపాడుకునే మార్గాలు ఇవే!

ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంకొన్ని రోజుల్లో ఇంటికి వస్తుందనగా.. అకస్మాత్తుగా విరుచుకుపడే తుపాన్లు అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తుంటాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. వేలాది హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలు నీట మునిగాయి. అర్నబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2 లక్షల 24వేల హెక్టార్లలో వ్యవసాయ , ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నీట మునిగాయి, చేతికొచ్చిన పత్తి నేలరాలింది, భారీ ఈదురు గాలులకు అరటి, బొప్పాయి తోటలు మొదళ్లతో సహా విరిగిపోయాయి. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో ఈ అర్నబ్ తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. సుమారు 3 లక్షల 45వేల మంది రైతులు తమ పంటలను కోల్పోయి, అప్పుల పాలయ్యే పరిస్థితికి చేరుకున్నారు.ప్రస్తుతం తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన అధిక వర్షాలు కురుస్తుండడంతో పంటలకు జరిగే నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి, పంటల సంరక్షణకు రైతులు తీసుకోవాల్సిన చర్యలపై గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పలు సూచనలు చేసింది.
రాష్ట్రంలో తుపాను కారణంగా అత్యధికంగా దెబ్బతిన్నది వరి పంటే. ముందుగా ఈదురు గాలులకు నేలకొరిగిన వరి మొక్కలను జాగ్రత్తగా పైకి లేపి కట్టుకోవాలి. అప్పటికే కోత కోసి, కళ్ళాల్లో లేదా పొలంలో కుప్పల మీద ఉన్న ధాన్యంపై వెంటనే పట్టలు కప్పి రక్షించుకోవాలి. ఇక్కడ రైతులకు ఉపయోగపడే ఒక అద్భుతమైన చిట్కాను శాస్త్రవేత్తలు సూచించారు. కోసిన ధాన్యాన్ని రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలు కానప్పుడు.. కుప్పల్లో ఉన్న గింజలు మొలకెత్తకుండా, వాటి రంగు మారకుండా ఉండేందుకు ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో గళ్లు ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి ఉంచాలి. దీనివల్ల ధాన్యం మొలకెత్తదు. అలాగే గింజ గట్టిపడే దశలో ఉన్న వరి పంట వర్షాలకు గురై, కోత దశలో పడిపోయి కంకిలో మొలకలు కనిపిస్తే.. వెంటనే పొలంలో నీరు బయటకు పంపిన తర్వాత 5 శాతం ఉప్పు ద్రావణాన్ని అంటే లీటరు నీటికి 50 గ్రాముల గళ్లు ఉప్పు కలిపి కంకులపై పిచికారీ చేయాలి. ఇది గింజలు మొలకెత్తడాన్ని, రంగు మారడాన్ని చాలా వరకు అరికడుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత వరిలో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పూత దశకు ముందున్న పొలాల్లో ఎండాకు తెగులు, మానిపండు తెగులు, మాగుడు తెగులు, ఆకుముడత, దోమపోటు పెరిగే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు లక్షణాలు కనిపిస్తే ప్లాంటోమైసిస్ 1 మిల్లీ లీట్లరు, కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు.. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నీరు తగ్గిన తర్వాత ఎకరాకు హెక్సాకోనజోల్ 400 మిల్లీ లీటర్లు లేదా ప్రోపికోనజోల్ 200 మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే మాగుడు వ్యాప్తి తగ్గుతుంది. మానిపండు తెగులు నివారణకు..ఎకరాకు 200 మిల్లీ లీటర్ల ప్రోపికోనజోల్ను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు నివారణకు..ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాన్ట్రిప్రోల్ 60 మిల్లీ లీటర్లు.. 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ పొలంలో దోమపోటు, మాగుడు, మానిపండు తెగుళ్లు ఒకేసారి కనిపిస్తే.. ఎకరానికి ప్రోపికోనజోల్ 200 మిల్లీ లీటర్లు, పైమెట్రోజోల్ 200 మిల్లీ లీటర్లు , ట్రైప్లుమెజోపైరం 10 ఎస్.సి. 96 మిల్లీ లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు చల్లడానికి డ్రోన్లను ఉపయోగించడం ఎంతో ఉత్తమం.



