తెలంగాణలో కరువు మండలాలు ఇవే..రైతు ఖాతాలో డబ్బులు పడేది ఎప్పుడంటే..?

గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏర్పడిన ఎల్నినో ప్రభావం ఈ ఏడాది తెలంగాణ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. వర్షాలు లేక పంటలు ఎండిపోవడం, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటడంతో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఉన్న విపత్కర పరిస్థితులను అంచనా వేసిన తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని కరువు మండలాలను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 33 జిల్లాల్లో హైదరాబాద్, పెద్దపల్లి మినహా మిగిలిన 31 జిల్లాలను కరువు జాబితాలో చేర్చింది. వీటిలో 111 మండలాల్లో తీవ్ర కరువు, 254 మండలాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఉన్నట్లు వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నమోదైన వర్షపాతం, ప్రతీ మండలంలోని 10 శాతం గ్రామాల్లో ఉన్న భూగర్భ జలాల పరిస్థితి, మరియు పంటల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఈ జాబితాలో లేని మండలాల్లో కూడా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రానున్న రోజుల్లో అక్కడ కూడా ప్రభావం ఎక్కువైతే, వాటిని కూడా కరవు జాబితాలో చేరుస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. సాధారణంగా రాష్ట్రంలో ఈ సీజన్లో 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది ఏకంగా 17 శాతం లోటుతో కేవలం 615.5 మిల్లీ మీటర్ల వర్షమే కురిసింది. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం కుదేలైంది.
రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఖరీఫ్ సాగు ఏకంగా కోటీ 39 లక్షల 28 వేల ఎకరాల్లో జరగాల్సి ఉండగా, వర్షాభావం వల్ల అది కోటీ 26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ముఖ్యంగా తెలంగాణకు వెన్నెముక లాంటి వరి సాగు విస్తీర్ణం ఏకంగా 18 శాతం మేర తగ్గిపోయింది. గతంలో 69 లక్షల 19 వేల ఎకరాల్లో వరి సాగు జరగ్గా, ఇప్పుడు అది 57 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఇక తాగు, సాగు నీటి కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలోని మేజర్, మైనర్ రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యం 585 టీఎంసీలు కాగా, ప్రస్తుతం వాటిలో కేవలం 179.63 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల తాగునీరు, సాగునీరు, విద్యుత్, పశుగ్రాసానికి తీవ్రమైన కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
పంటలు పండక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు ఉపక్రమించింది. కరవు మండలాల్లో వెంటనే సహాయక కార్యక్రమాలు ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడం, మూగజీవాలకు పశుగ్రాసం సమకూర్చడం, అవసరమైతే వాటి కోసం పశు శిబిరాలు నిర్వహించడం లాంటి చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం వీబీజీ రామ్జీ పథకం ద్వారా పనులు కల్పించనున్నారు.
బ్యాంకర్లతో తక్షణమే సమావేశాలు ఏర్పాటు చేసి, వ్యవసాయ రుణాలను రీస్ట్రక్చర్ చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. కరవుతో అల్లాడుతున్న రైతులపై పాత రుణాల రికవరీ కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని బ్యాంకర్లకు గట్టిగా సూచించారు. ఇక కేంద్ర సాయం అందిన నెల రోజుల వ్యవధిలోనే నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ నేరుగా జమ చేయాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ కరవు పరిస్థితిని తట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు మాత్రమే సరిపోవు. అందుకే కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం తెలంగాణ అసెంబ్లీ ఒక కీలక తీర్మానం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి సాయం అందించాలని కోరుతూ, వారం రోజుల్లో కేంద్ర వ్యవసాయ, హోం శాఖలకు మెమోరాండం పంపాలని విపత్తు నిర్వహణ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఈ విపత్తును పరిశీలించడానికి వెంటనే కేంద్ర పరిశీలన బృందాన్ని రాష్ట్రానికి పంపాలని, వారితో పాటు 20 వేల కోట్ల ప్రత్యేక కరవు ప్యాకేజీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే కరవు సమయంలో వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రానికి అదనంగా 1500 మెగావాట్ల విద్యుత్, సరిపడా ఎరువులు కేటాయించాలని, గ్రామీణ కూలీల కోసం వీబీజీ రామ్జీ పథకం కింద అదనంగా మరో 50 పని రోజులు కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.



