పాత్ర ఏదైనా ప్రత్యేకమే.. నటనలో కమల్ హాసన్ శైలే వేరు!

ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించగల సత్తా ఉన్న లెజెండరీ నటుడు కమల్ హాసన్. ఈ రోజు ఆయన తన 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణం ఒక అద్భుతమైన పాఠ్యపుస్తకం లాంటిది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, నేడు వంద కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అద్భుతాలు ఉన్నాయి.మూకీ సినిమాలో నటించిన పుష్పక విమానం నుంచి, 10 భిన్నమైన పాత్రలు పోషించిన దశావతారం వరకు.. అలాగే రీసెంట్ గా వచ్చిన విక్రమ్, కల్కి వరకు కమల్ హాసన్ చేసిన ప్రయోగాలు మరే హీరో చేసి ఉండరు. 1960లో వచ్చిన కలథూర్ కన్నమ్మ చిత్రంతో ఆరేళ్ల వయసులోనే బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఇక నటుడిగా మరెవరికీ సాధ్యం కాని ఎన్నో పాత్రలకు కమల్ జీవంపోశారు. అపూర్వ సహోదరులు సినిమాలో మరుగుజ్జు అప్పుగా ఆయన చేసిన యాక్టింగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆయన నటించిన పుష్పక విమానం, అండర్ వరల్డ్ డాన్ గా ఆయన విశ్వరూపం చూపించిన మణిరత్నం నాయకన్, అలాగే వృద్ధుడిగా ఉగ్రవాద నిర్మూలన కోసం పోరాడిన శంకర్ భారతీయుడు..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా వేటికవే ప్రత్యేకం.
ఒక నటుడు సినిమాలో ద్విపాత్రాభినయం చేయడమే సాధారణ విషయం కాదు. అలాంటిది ఒకే సినిమాలో ఏకంగా 10 విభిన్నమైన పాత్రలు పోషించడం ఆయనకు మాత్రమే సాధ్యం. దశావతారంలో అన్ని పాత్రలను ఆయన చేసి చూపించగలిగారు. ఇక ఎన్నో సినిమాల్లో తన క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ లుక్ రావడం కోసం ఎన్నోసార్లు తన శరీరాన్ని మార్చుకున్నారు. అందుకే ఆయన నటనను కీర్తించని సినీ అభిమాని కానీ నటుడు కానీ ఉండరంటారు. 72 ఏళ్ల వయసులో కూడా ఆయన బాక్సాఫీస్ ను ఏలుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఇచ్చిన కమ్ బ్యాక్ చూసి ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ కల్కి లో సుప్రీమ్ యాస్కిన్ గా మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు.
కమల్ హాసన్ ఇప్పటివరకు 230కి పైగా చిత్రాల్లో నటించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. హీరోగానే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, సింగర్, ఎడిటర్, కొరియోగ్రాఫర్, మేకప్ ఆర్టిస్ట్‌గానూ పనిచేశారు. కమల్ హాసన్ టాలెంట్ కు దేశ, విదేశాల్లో ఎన్నో గౌరవాలు దక్కాయి. 1978లో కళైమామణి, 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వం చెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ తో సత్కరించింది. 2025లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆయనను నటుల విభాగంలో సభ్యుడిగా ఆహ్వానించింది. ఏడు పదుల వయసు వచ్చినా కమల్ క్రేజ్ మాత్రం ఇండస్ట్రీలో తగ్గలేదు. ఆయన ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే యాక్టర్స్ లో ఒకరు. 1994లో ఓ చిత్రానికి కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి కోలీవుడ్ నటుడిగా కూడా రికార్డ్ సృష్టించారు. 2022లో విడుదలైన విక్రమ్ సినిమాకు కమల్ కెరీర్లో మరో మైల్ స్టోన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ మార్కెట్ మరింత పెరిగింది. ప్రస్తుతం కమల్ హాసన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.



