పెంచి పోషించిన ఉగ్రవాదులే ఇప్పుడు పాక్‌కు శాపం.. పోలీసులపై మారణహోమం

దశాబ్దాలుగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ వస్తున్న పాకిస్థాన్ కు అవే ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పాకిస్థాన్ భద్రతా బలగాల పాలిట మృత్యుపాశంగా మారుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. తాజాగా ఈ ప్రావిన్స్‌లో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పక్కా స్కెచ్ వేసి చేసిన భారీ మెరుపు దాడిలో ఏకంగా 11 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో తీవ్రవాదానికి, మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్. ఈ ప్రావిన్స్‌లోని కోహత్ జిల్లా, గుంబాత్ కోహత్ ప్రాంతంలో కొంతకాలంగా భారీ ఎత్తున అక్రమ బంగారం మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ మైనింగ్ వెనుక ఒక పెద్ద క్రిమినల్ మాఫియా హస్తం ఉందన్న పక్కా సమాచారంతో, వారి ఆటకట్టించడానికి స్థానిక పోలీసులు ఒక వ్యాన్‌లో ఆ ప్రాంతానికి బయల్దేరారు. కానీ, పోలీసులు వస్తున్నారన్న సమాచారం ఆ మాఫియాకు ముందే లీక్ అయింది. దీంతో వారు నేరుగా ఉగ్రవాదులతో చేతులు కలిపారు. పోలీసుల వ్యాన్.. దర్బోకచ్ జలంధర్ బందా అనే ప్రాంతానికి చేరుకోగానే సీన్ మారిపోయింది. ఆ దారికి ఇరువైపులా ఉన్న దట్టమైన పొదల చాటున అప్పటికే మాటు వేసి ఉన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా పోలీసుల వ్యాన్‌ను టార్గెట్ చేస్తూ ఆటోమేటిక్ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఊహించని ఈ మెరుపు దాడి నుంచి పోలీసులు తేరుకునే లోపే, బుల్లెట్ల వర్షం కురిసింది. ఉగ్రవాదులు అత్యంత సమీపం నుంచి ఏకే-47 తుపాకులతో పోలీసులను విచక్షణారహితంగా కాల్చి చంపారు.
ఈ దాడితో పాక్ పోలీసులకు భారీ ప్రాణనష్టం తప్పలేదు. పోలీస్ అధికార ప్రతినిధి మహమ్మద్ నౌమాన్ జెబ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘోరమైన కాల్పుల్లో 11 మంది పోలీసులు వీరమరణం పొందారు. ఇందులో ఆ ఆపరేషన్‌ను లీడ్ చేస్తున్న గంబత్ ప్రాంత డీఎస్పీ హైదర్ జమాన్, సబ్ ఇన్స్పెక్టర్ ముక్తియార్ కూడా ప్రాణాలు కోల్పోవడం పాక్ పోలీస్ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అటు పోలీసులు, ఇటు మిలిటెంట్ల మధ్య చాలా సేపు హోరాహోరీగా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మరో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆ 12 మంది పోలీసులు అత్యవసర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 11 మంది పోలీసుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంతపెద్ద ఎత్తున పోలీసులు చనిపోవడంతో కోహత్ జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. రోడ్లన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ , పోలీసులు, ఆ ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మైనింగ్ మాఫియాకు ఈ ఉగ్రవాదులకు మధ్య ఉన్న లింక్‌ను బ్రేక్ చేయడానికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి.
ఈ ఉగ్రదాడి ఘటనను ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ గవర్నర్ ఫైజర్ కరీమ్ కుందీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఎలా జరిగిందో ఆయన స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న క్రిమినల్స్‌కు , అడవుల్లో నక్కి ఉన్న టెర్రరిస్టులకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందం వల్లే మన పోలీసులపై ఇంతటి దారుణమైన దాడి జరిగింది అని డబ్బుల కోసం అక్రమ వ్యాపారాలు చేసే క్రిమినల్స్.. తమకు అండగా ఉగ్రవాదులను వాడుకుంటున్నారని, వారిద్దరి మధ్య ఉన్న సంధిని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఆ 11 మంది పోలీసుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇప్పుడు అసలు శత్రువులు బయట లేరు, దేశం లోపలే ఉన్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా , బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో ప్రతిరోజూ ఏదో ఒక చోట పాక్ ఆర్మీని లేదా పోలీసులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు పాక్ ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు ఇండియాను టార్గెట్ చేయడానికి పెంచి పోషించిన ఈ ముఠాలు, ఇప్పుడు పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలనే దెబ్బతీస్తూ ఆ దేశాన్ని పతనం అంచుకు తీసుకెళ్తున్నాయి.



