పెద్ది కాంట్రవర్సీ పై నోరు విప్పిన జాన్వీ!

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం పెద్ది . ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్ర ఊహించని వివాదంలో చిక్కుకుంది. సినిమాలో జాన్వీని, ఆమె పాత్రను దర్శకుడు తెరపై ప్రెజెంట్ చేసిన విధానం తీవ్ర దుమారం రేపింది. మహిళలను కించపరిచేలా జాన్వీని చూపించారంటూ, కొన్ని కెమెరా యాంగిల్స్ అత్యంత అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, మహిళా సంఘాలు, విమర్శకులు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. అయితే,అప్పుడు జాన్వీ ఈ విషయంపై ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఆ మౌనాన్ని వీడింది. పెద్ది సినిమా వివాదంపై తొలిసారిగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాఫీ విత్ కరణ్ షో తన లేటెస్ట్ సీజన్ లో భాగంగా కరణ్ జోహార్ ఈసారి జాన్వీ కపూర్ , వరుణ్ ధావన్ లను గెస్టులుగా ఆహ్వానించారు. ఈ షోలో పెద్ది సినిమాలో అచ్చియమ్మ పాత్రపై వచ్చిన విమర్శల గురించి కరణ్ జోహార్ , జాన్వీకి ఒక సూటి ప్రశ్న వేశాడు. జాన్వీ, పెద్ది సినిమా విషయంలో అసలు ఏం జరిగింది? ఆ వివాదం జరిగిన రోజు నేను నీతో ఫోన్లో మాట్లాడాను. ఈ వివాదాన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చు. చాలామంది ఆ రోల్‌ను తప్పుగా, అసభ్యంగా చిత్రీకరించారనే దర్శకుడిని ట్రోల్ చేశారు. మరోవైపు, ఆ సీన్స్ తీసేటప్పుడు హీరోయిన్ గా నువ్వు కూడా సెట్లోనే ఉన్నావు కదా? కళ్ళ ముందే కెమెరా యాంగిల్స్ అలా పెడుతుంటే దాన్ని ఎందుకు ప్రశ్నిచలేదు? మౌనంగా ఎందుకు నటించావు? అంటూ కొందరు విమర్శించారు. దీనిపై నీ స్పందన ఏంటి? అంటూ కరణ్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ చాలా ఎమోషనల్ గా, తనలో ఇన్ని రోజులు దాచుకున్న ఆవేదనను మొత్తం బయటపెట్టింది.కరణ్ ప్రశ్నకు బదులిస్తూ జాన్వీ కపూర్ తన తప్పును ఏమాత్రం దాచకుండా బహిరంగంగా అంగీకరించింది. ఆ వివాదం జరిగినప్పుడు నేను కావాలనే సైలెంట్ గా ఉన్నాను. ఎందుకంటే, ఆ సినిమా కోసం వందలాది మంది టెక్నీషియన్లు, డైరెక్టర్, హీరో ఎంతో కష్టపడ్డారు. నా ఒక్క కామెంట్ వల్ల వాళ్ల కష్టమంతా పక్కకు వెళ్లిపోయి, కేవలం వివాదం మాత్రమే హైలైట్ అవుతుందనే భయంతోనే నేను మౌనంగా ఉండిపోయాను. కానీ సినిమాలో నా పాత్రపై జరిగిన నెగిటివ్ ప్రచారం నన్ను మానసికంగా చాలా బాధించింది అని జాన్వీ చెప్పుకొచ్చింది. నా పాత్ర చూపించిన తీరు సమాజంపై, ముఖ్యంగా మహిళల పట్ల ఉండే దృక్పథంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొన్ని సీన్లు నిజంగానే అభ్యంతరకరంగా ఉన్నాయి. నా పాత్ర విషయంలో జరిగిన దానికి నేను బాధ్యత తీసుకోవాల్సిందే. వంద శాతం అది నా పొరపాటే. నేను ఆ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సింది. ఒక మహిళగా నాకు చాలా బాధేసింది. దీని వల్ల కలిగిన ఆ అవమాన భారాన్ని నేను నా జీవితాంతం మోయక తప్పదు అంటూ జాన్వీ ఎమోషనల్ అయ్యింది. గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ ఉన్న ఒక స్టార్ హీరోయిన్, నేషనల్ టెలివిజన్ లో ఇలా తన తప్పును ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ భవిష్యత్తులో తాను తీసుకోబోయే జాగ్రత్తల గురించి కూడా స్పష్టత ఇచ్చింది. ఒక స్టార్ కిడ్ గా ఉండి కూడా తనకే సెట్స్ లో నో చెప్పడానికి ఇంత ఇబ్బంది ఉంటే, ఇక ఏ బ్యాక్ గ్రౌండ్ లేని కొత్త హీరోయిన్ల పరిస్థితి ఏంటనే పాయింట్ ను నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎదురుకాకుండా చూసుకోవడమే ఇప్పుడు తన ముందున్న ఏకైక లక్ష్యం అని జాన్వీ స్పష్టం చేసింది. ఏది ఏమైనా, పెద్ది సినిమాలో అచ్చియమ్మ పాత్ర విషయంలో జరిగిన వివాదానికి జాన్వీ కపూర్ ఇలా బహిరంగ క్షమాపణలు చెప్పడం ఆమె హుందాతనాన్ని తెలియజేస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు.



