భారత్ తో ట్రేడ్ లేకుంటే ఇది పాక్ పరిస్థితి...ఏకంగా 3.50 లక్షల కోట్లు నష్టం

2019లో పుల్వామాలో జరిగిన ఆ ఉగ్రదాడిని ఏ భారతీయుడూ మర్చిపోలేడు. ఆ దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన దాడికి జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థే కారణం. ఆ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులను మట్టికరిపించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం సైనిక చర్యతో మాత్రమే ఆగిపోలేదు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ఒక సైలెంట్ వార్ స్టార్ట్ చేసింది. పాకిస్థాన్ ఆయువుపట్టును గట్టిగా దెబ్బకొట్టింది. ఆ ఒక్క దెబ్బతో గడిచిన ఐదారేళ్ల వ్యవధిలో పాకిస్థాన్ దాదాపుగా 3 లక్షల 50వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను నష్టపోయింది. ఈ చేదు నిజాన్ని ఇండియన్ మీడియా చెప్పట్లేదు, స్వయంగా పాకిస్థాన్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా వెల్లడించి పాక్ పాలకుల గుండెల్లో గుబులు రేపారు.
భారతదేశం 2019లో పాకిస్థాన్ పై ట్రేడ్ సస్పెన్షన్ వేసినప్పుడు, పాక్ పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. మాకు చైనా ఉంది, అమెరికా ఉంది ఇండియా మమ్మల్ని ఏం చేస్తుంది అని విర్రవీగారు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి వాళ్లకు అసలు సినిమా కనిపించింది. ఇస్లామాబాద్ లో ఇటీవల జరిగిన బిజినెస్ అడ్వకసీ గ్రూప్ సమావేశంలో పాకిస్తాన్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ నూర్ మహ్మద్ కసూరి సంచలన విషయాలు బయటపెట్టారు. భారత్తో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఈ అయిదేళ్ల కాలంలో తమ దేశం ఏకంగా 40 బిలియన్ డాలర్ల మేర భయంకరమైన నష్టాన్ని చవిచూసిందని ఆయన స్పష్టం చేశారు. పక్కనే భౌగోళికంగా ఇండియా ఉన్నప్పటికీ.. భారత్ తో ట్రేడ్ బంద్ అవ్వడంతో, పాకిస్థానీ పరిశ్రమలు తమకు కావలసిన అత్యవసర ముడిసరుకులు, ఇతర నిత్యావసర వస్తువుల కోసం సుదూరంగా ఉన్న ఇతర ఖండాలు, అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడాల్సి వస్తోందని కసూరీ వివరించారు. పక్కనున్న ఇండియా నుంచి సరుకు తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అసలు ఉండేదే కాదు.. కానీ ఇప్పుడు వేరే ఖండాల నుంచి సరుకులను సముద్ర మార్గంలో రవాణా చేయాల్సి వస్తోందని, ఫలితంగా ఫ్రైట్ ఛార్జీలు , డెలివరీ సమయం గణనీయంగా పెరిగిపోయి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.
పాకిస్థాన్ లో ఇప్పుడు చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఇండస్ట్రీ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్ పరిశ్రమ. కానీ ఇండియా వాణిజ్యం ఆపేయడంతో ఆ పరిశ్రమ ఇప్పుడు వెంటిలేటర్ మీద కొట్టుకుంటోంది. ఇంకోవైపు మందుల తయారీ అయితే పూర్తిగా దివాలా తీసింది. ఒకప్పుడు పాకిస్థాన్ కు కావాల్సిన నాణ్యమైన పత్తి గానీ, ఫార్మాస్యూటికల్ ముడిసరుకులు గానీ చౌక ధరలకు మన ఇండియా నుంచే వెళ్లేవి. ఎప్పుడైతే ఇండియా సప్లై చైన్ కట్ చేసిందో, పాకిస్థాన్ కుదేలవుతోంది. పాకిస్తాన్ ఔషధ తయారీ రంగానికి కావలసిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ముడిసరుకులు గతంలో భారత్ నుంచే పెద్ద ఎత్తున దిగుమతి అయ్యేవని PIBC చీఫ్ కసూరి గుర్తు చేశారు. ఒకవేళ భారత్ నుంచి ఈ ముడిసరుకులను నేరుగా కొనుగోలు చేస్తే పాకిస్తాన్ ఫార్మా పరిశ్రమకు ఏటా 2 నుంచి 3 బిలియన్ డాలర్ల వరకు ఫండ్స్ ఆదా అవుతాయని ఆయన అంచనా వేశారు. కానీ ఇండియాను కాదని యూరప్, చైనాల మీద ఆధారపడటం వల్ల పాక్ ఫార్మా ఇండస్ట్రీ కుప్పకూలింది. మరోవైపు పాకిస్తాన్లో పత్తి సాగు దారుణంగా క్షీణించింది. దీంతో పాకిస్థాన్ లోని స్థానిక జౌళి మిల్లులు ముడిసరుకు కోసం బ్రెజిల్, ఈజిప్ట్, చైనా, అమెరికా వంటి దేశాల నుంచి విపరీతమైన రవాణా ఖర్చులు భరించి పత్తిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. కేవలం ఈ ఒక్క పత్తి దిగుమతుల వల్లే పాకిస్థాన్ కు అదనంగా ఏకంగా 5 బిలియన్ డాలర్ల భారం పడిందని బిజినెస్ కౌన్సిల్ చెబుతోంది.
ఇవే కాకుండా చక్కెర, ఎరువులు, సిమెంట్, ఇనుము, కూరగాయలు, భారీ యంత్రాలను కూడా పాకిస్తాన్ ఎక్కువ రవాణా ఖర్చులు పెట్టి సుదూర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటోంది. మన భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు భౌగోళికంగా పాకిస్తాన్కు అతి దగ్గరగా ఉన్నాయని, అక్కడి నుంచి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే చాలా చౌకగా లభిస్తాయని ఆయన ప్రభుత్వానికి వివరించారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి పాక్ ఇండస్ట్రీస్ బతికి బట్టకడతాయని ఆయన మొత్తుకుంటున్నారు. పాకిస్థాన్ బిజినెస్ లీడర్స్ కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. భారత్తో వాణిజ్య బంధం పునరుద్ధరణకు నోచుకుంటే పారిశ్రామిక రంగానికే కాకుండా పర్యాటకం , నూతన పెట్టుబడులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని పాకిస్తాన్ వ్యాపార వర్గాలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నాయి. పాకిస్తాన్ భూభాగంలో పురాతన కాలం నాటి ఎన్నో హిందూ పుణ్యక్షేత్రాలు , సిక్కుల పవిత్ర స్థలాలు ఉన్నాయి. అలాగే దేశ విభజనకు ముందు ఉన్న ఎంతోమంది పూర్వీకుల నివాసాలను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు వీసాలు ఇచ్చి ఆకర్షించడం ద్వారా పాకిస్తాన్ ఆర్థికంగా వందల కోట్లు ప్రయోజనం పొందవచ్చని PIBC ఛైర్మన్ కసూరి పాక్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. భారత్ లాంటి 5 ట్రిలియన్ ఎకానమీ పక్కన పెట్టుకుని, ప్రపంచం అంతా అడుక్కుతింటున్న పాక్ పాలకుల బుద్ధి తలమాసిన తీరును ఆయన పరోక్షంగా ఎండగట్టారు. ఎంతమంది వ్యాపారవేత్తలు మొత్తుకున్నా సరే.. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, మరోవైపు ఇండియా మాతో బిజినెస్ చేయాలి, మాకు ప్రాణభిక్ష పెట్టాలి అంటే కుదరదు. భారత విదేశాంగ శాఖ ఎప్పుడో ఒక స్పష్టమైన విధానం ప్రకటించింది. టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ . పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపేంతవరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు ఉండవు, ఎలాంటి వాణిజ్య సంబంధాలు ఉండవు అని ఇండియా తేల్చి చెప్పేసింది.



