ఒకప్పటి సెన్సేషనల్ నటి...28 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

ఒకప్పుడు తన అందంతో, అభినయంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టారు డిస్కో శాంతి. ఈ పేరు ఇప్పటి 2కే కిడ్స్ ప్రేక్షకులకు బహుశా అంతగా తెలియకపోవచ్చు. కానీ 80, 90ల లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆమె సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే, మరోవైపు తన డ్యాన్స్ తో, స్పెషల్ సాంగ్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. అంతటి పీక్ ఫామ్ లో ఉన్న టైమ్ లోనే రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి పెళ్లాడి సినిమాలకు గుడ్ బై చెప్పారు. చివరగా ఆమె 1997లో యుద్ధ అనే కన్నడ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఎంతోమంది అడిగినా ఆమె మేకప్ వేసుకోలేదు. కట్ చేస్తే సరిగ్గా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డిస్కో శాంతి ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ గా మారింది.
ఒక సినిమా కోసం ఆమెను ఒప్పించారు స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్. లారెన్స్ తమ్ముడు ఎల్విన్ హీరోగా పరిచయమవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బుల్లెట్ . ఇన్నాసైనార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్ ఫుల్ పాత్రను డిస్కో శాంతి పోషించబోతున్నారు..
28 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు రావడం అంటే ఒక ఆర్టిస్ట్ కు అది మామూలు విషయం కాదు. ఈ సినిమా లాంచ్ టైమ్ లోనే ఎల్విన్ ఈ విషయాన్ని బయటపెడుతూ.. తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక చాలా పెద్ద ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చదివితే డిస్కో శాంతి కి, లారెన్స్ ఫ్యామిలీకి ఎంత గొప్ప అనుబంధం ఉందో అర్థమవుతుంది. ఎల్విన్ తన పోస్ట్ లో ఏం రాశాడంటే.. సినిమా, పేరు, ప్రఖ్యాతలు, డబ్బుకు అతీతమైన కొన్ని బంధాలు ఈ లోకంలో ఉంటాయి. అలాంటి బంధమే నాకు, డిస్కో శాంతి అక్క మధ్య ఉంది. డిస్కో శాంతి మాకు కేవలం ఒక ఆర్టిస్ట్ లేదా సహనటి మాత్రమే కాదు. నాకు, నా సోదరుడు రాఘవ లారెన్స్కు ఆమె స్వయంగా ఒక సోదరి లాంటివారు. ఎన్నో ఏళ్లుగా ఆమెని మేం ఎంతో ప్రేమగా సొంత అక్కలాగా భావిస్తున్నాం. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించడానికి అంగీకరించడం వెనుక డబ్బు, పేరు, గుర్తింపు లాంటి కారణాలేం లేవు. చిన్న వయసులోనే తన కష్టంతో, ప్రతిభతో ఎంతో పేరు సంపాదించుకున్న ఆమె.. నా మొదటి సినిమా కోసం అంగీకరించడం వెనుక ఉన్న ఏకైక కారణం మాపై ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతే అని ఎల్విన్ చాలా ఎమోషనల్ గా తన మనసులోని మాటలను పంచుకున్నాడు..



