భారత్‌తో యుద్ధమొస్తే పాక్‌కే నా సపోర్ట్.. ఇజ్రాయెల్ మతగురువు నోటి దురుసు..ఇజ్రాయెల్ దిద్దుబాటు చర్యలు

ప్రపంచ వేదికపై భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రదేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. రక్షణ రంగంలో, టెక్నాలజీలో ఈ రెండు దేశాల మధ్య ఉన్న బంధం చాలా బలమైనది. ఇజ్రాయెల్ కష్టాల్లో ఉన్నప్పుడు భారతీయులు ఏ స్థాయిలో సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చారో మనందరికీ తెలుసు. అయితే, ఇలాంటి స్నేహపూర్వక వాతావరణంలో ఒక ఇజ్రాయెల్-అమెరికన్ మతగురువు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. అతని పేరు రబ్బీ యోసెఫ్ మిజ్రాచీ . హిందూ సంప్రదాయాలను, ముఖ్యంగా గోమాతను పూజించడాన్ని కించపరుస్తూ అతను అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా.. ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. ఇజ్రాయెల్, యూదులు కచ్చితంగా పాకిస్థాన్ వైపే నిలబడాలని ఒక వివాదాస్పద లాజిక్ ను తెరపైకి తెచ్చాడు. దీనికి అతను చెప్పిన రీజన్ మతం. ఇస్లాం మతంలో తౌహీద్ అంటే ఒకే దేవుడిని పూజించడం ఉంటుందని, యూదులు కూడా దాన్నే నమ్ముతారని అన్నాడు. కానీ హిందువులు విగ్రహారాధన చేస్తారు కాబట్టి, రాజకీయ ప్రయోజనాల కంటే మతపరమైన సిద్ధాంతాలకే యూదులు ఓటు వేయాలని, అందుకే పాకిస్థాన్ కు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చాడు.
రబ్బీ యోసెఫ్ మిజ్రాచీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. ఎప్పుడైతే భారతీయుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మొదలైందో, ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యల వల్ల రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతినకూడదని భావించిన ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది. భారత్‌లోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ వెంటనే స్పందిస్తూ.. భారతీయులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. రబ్బీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, అతనొక రాడికల్ అని, ఉన్మాది అని మండిపడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలు భారతదేశాన్ని, ఇక్కడి మత విశ్వాసాలను ఎంతో గౌరవిస్తారని, ఇలాంటి ఒక పిచ్చివాడి మాటలను ఇజ్రాయెల్ అభిప్రాయంగా భావించవద్దని ఆయన భారతీయులను కోరారు.
రబ్బీ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు సైతం హుందాగానే స్పందించారు. ఇజ్రాయెల్ కు ఇండియా ఎంతో సాయం చేస్తోంటే, ఇలా మతం పేరుతో పాకిస్థాన్ కు మద్దతు ఇవ్వాలనడం అతని కరడుగట్టిన రాడికల్ మైండ్ సెట్ కు నిదర్శనమని విమర్శించారు. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులు సైతం భారతీయులకు మద్దతుగా నిలిచారు. రబ్బీ లాంటి వ్యక్తులు కేవలం సమాజంలో ద్వేషాన్ని పెంచడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, వీటివల్ల దౌత్య సంబంధాలకు ఎలాంటి విఘాతం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒక దేశంలో ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక రాడికల్ సంస్థ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం మొత్తానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. యోసెఫ్ మిజ్రాచీ గతంలో యూదుల మారణహోమం పై, వికలాంగులపై కూడా ఇలాగే అవాకులు చవాకులు పేలి బ్రిటన్ లాంటి దేశాల నుంచి బ్యాన్ కు గురయ్యాడు. ఇలాంటి వ్యక్తుల మాటలను ఇజ్రాయెల్ ప్రభుత్వమే స్వయంగా ఖండించిందంటే, ఇండియా అంటే ఆ దేశానికి ఎంత గౌరవమో మనం అర్థం చేసుకోవచ్చు.



