మట్టి కవర్ లో 3,800 ఏళ్ల నాటి ఓ భార్య లేఖ అందులో ఏం ఉందో తెలుసా?

భూమి పొరల్లో వేల ఏళ్లుగా దాగిన ఈ అరుదైన మట్టి కవర్, ప్రస్తుత తుర్కియే దేశంలోని పురాతన అనటోలియా ప్రాంతంలో ఉన్న కుల్తెపె వద్ద జరిపిన తవ్వకాల్లో పురావస్తు శాఖకు లభించింది. ఈ కుల్తెపె నే ప్రాచీన కాలంలో కనేష్ నగరం అని పిలిచేవారు. ఇది ఆసియా మైనర్ లో ఒక అతిపెద్ద వాణిజ్య కేంద్రం. అంటే వ్యాపారాలకు, లావాదేవీలకు ఇది ఒక అడ్డా లాంటిది. ఇక్కడ దొరికిన ఈ మట్టి కవర్ ను ప్రస్తుతం అంకారాలోని అనటోలియన్ నాగరికతల మ్యూజియంలో అత్యంత భద్రంగా ఉంచారు. అయితే ఈ సీల్ చేసిన కవర్ లోపల ఉన్న లేఖలో ఏముందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఒక భారీ రీసెర్చ్ చేపట్టారు. ఆ రీసెర్చ్ లో కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.
అప్పట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన క్యూనిఫామ్ లిపి లో ఉన్న ఈ లేఖను అన్నా-అన్నా అనే ఒక వ్యాపారవేత్త భార్య రాసింది. వాణిజ్యం నిమిత్తం దూర ప్రాంతంలో ఉన్న తన భర్త ఎన్నమ్-అషూర్ కు ఆమె ఈ లేఖను అత్యంత భద్రంగా మట్టి కవర్లో సీల్ చేసి పంపించింది. లేఖలో ఉన్న సారాంశం ఏంటంటే.. తన భర్త ఆదేశాల మేరకు, లఖేపమ్ అనే వ్యక్తి నుంచి రావలసిన అప్పును, అంటే వెండిని తిరిగి వసూలు చేయడానికి అన్నా-అన్నా అతని దగ్గరకు స్వయంగా వెళ్లింది. అయితే, ఆ అప్పును ఆమెకు చెల్లించడానికి లఖేపమ్ నిర్మొహమాటంగా నిరాకరించాడు. నేను నీకు ఇవ్వను, నీ భర్త ఇక్కడికి తిరిగి వచ్చాక, నేరుగా అతనికే చెల్లిస్తాను అని తెగేసి చెప్పాడు. అంతేకాకుండా ఆ డబ్బును నేను ఇప్పటికే వేరొకరికి ఇచ్చేశానని కూడా బుకాయించాడు. అతను చెప్పేది పచ్చి అబద్ధం అని ఆమెకు అర్థమైంది. ఈ మోసాన్ని, తనకు జరిగిన అవమానాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ అన్నా-అన్నా తన భర్తకు ఆ లేఖ ద్వారా ఒక సుదీర్ఘమైన ఫిర్యాదు చేసింది. అంటే 3,800 ఏళ్ల క్రితం కూడా అప్పుల గొడవలు, తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టడాలు, ఫైనాన్షియల్ లావాదేవీల పట్ల మహిళలకు ఉన్న అవగాహన ఎంత పక్కాగా ఉండేవో ఈ ఒక్క లేఖ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది.



