రుషికొండ తీరానికి దూసుకొచ్చిన హోవర్ క్రాఫ్ట్ లు..ఇవి సముద్రంలో ఏం చేస్తాయో తెలుసా?

భారతదేశ తూర్పు తీర రక్షణకు ప్రధాన కేంద్రం, తూర్పు నావికాదళానికి కీలకమైన విశాఖపట్నం ఎప్పుడూ రక్షణ దళాల కదలికలతో బిజీగానే ఉంటుంది. తాజాగా కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు భారీ నౌకలు నేరుగా రుషికొండ తీరానికి చేరుకున్నాయి. భారత తీర ప్రాంత భద్రతలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ది అత్యంత కీలక పాత్ర. బంగాళాఖాతంలో స్మగ్లర్ల కదలికలను కనిపెట్టడానికి, ఎవరైనా మత్స్యకారులు ప్రమాదంలో ఉంటే కాపాడటానికి ఈ హోవర్‌క్రాఫ్ట్‌లు నిరంతరం పెట్రోలింగ్ చేస్తుంటాయి. అయితే ఉన్నట్టుండి బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీయడం, సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు భయంకరంగా ఎగిసిపడటంతో కోస్ట్ గార్డ్ దళాలు అప్రమత్తమయ్యాయి. రెగ్యులర్ పెట్రోలింగ్ లో ఉన్న ఈ రెండు హోవర్క్రాఫ్ట్లకు వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే సమీపంలో ఉన్న రుషికొండ బీచ్ కు చేరుకుని ఎమర్జెన్సీ హాల్ట్ చేశాయి. సముద్రంలో నుంచి నేరుగా ఇసుక పైకి వస్తున్న ఈ క్రాఫ్ట్ లను చూసి బీచ్ లో ఉన్న పర్యాటకులు ఆశ్చర్యపోతూనే సెల్ ఫోన్లలో వీడియోలు తీయడం మొదలుపెట్టారు. వెంటనే అలర్ట్ అయిన కోస్ట్ గార్డ్ సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని పర్యాటకులను ఆ హోవర్‌క్రాఫ్ట్‌ల వద్దకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వాతావరణం చక్కబడే వరకు ఇవి ఇక్కడే ఉంటాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ హోవర్ క్రాఫ్ట్ అనేది మిలిటరీ వాడే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మార్వెల్. దీనికి కార్లు, ట్రక్కుల్లాగా చక్రాలు ఉండవు, పడవల్లాగా నీటి లోపల తిరిగి నెట్టుకుపోయే ప్రొపెల్లర్లు అసలే ఉండవు. మరి ఇది ఎలా ప్రయాణిస్తుంది? దీని కింది భాగంలో ఒక పెద్ద రబ్బర్ స్కర్ట్ ఉంటుంది. పైనున్న శక్తివంతమైన భారీ ఫ్యాన్లు గాలిని ఆ స్కర్ట్ లోకి విపరీతమైన ఒత్తిడితో పంపిస్తాయి. ఆ గాలి ఒత్తిడికి ఈ మొత్తం వాహనం భూమి మీద లేదా నీటి మీద కాస్త పైకి లేచి గాలిలో తేలుతూ ప్రయాణిస్తుంది. అందుకే దీనికి నీరు, నేల, బురద, చిత్తడి నేలలు, మంచు.. ఇలా ఏది అడ్డు వచ్చినా సంబంధం లేదు. ఇది అచ్చమైన యాంఫిబియస్ వెహికిల్. అంటే సముద్రంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతూ, బ్రేక్ వేయకుండా అలాగే నేరుగా బీచ్ ఇసుక మీదకు వచ్చేస్తుంది. సముద్ర తీర ప్రాంతాల్లో దొంగ రవాణాను అడ్డుకోవడానికి, ఉగ్రవాదులు పడవల ద్వారా తీరానికి చేరుకోకుండా పెట్రోలింగ్ చేయడానికి కోస్ట్ గార్డ్‌కు ఈ హోవర్క్రాఫ్ట్లే బెస్ట్ ఆయుధాలు. లోతు తక్కువ ఉన్న సముద్ర ప్రాంతాల్లో సాధారణ పడవలు ఇసుకలో కూరుకుపోతాయి, కానీ హోవర్‌క్రాఫ్ట్‌లు గాలిలో తేలుతాయి కాబట్టి సునాయాసంగా శత్రువులను తీరం వరకూ వెంబడించి పట్టుకోగలవు.
భారతదేశానికి సుమారు 7,500 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘమైన సముద్ర తీరప్రాంతం ఉంది. ఈ తీరాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యమే ఇండియన్ కోస్ట్ గార్డ్. నావీ డీప్ సీ ఆపరేషన్స్ , అంతర్జాతీయ జలాల్లో ఆధిపత్యం చూసుకుంటే.. కోస్ట్ గార్డ్ తీరానికి దగ్గరగా ఉంటూ మన ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో నిరంతరం పహారా కాస్తుంది. వైజాగ్ కు ఉన్న భౌగోళిక ప్రాముఖ్యత దృష్ట్యా ఇక్కడ కోస్ట్ గార్డ్ హెడ్‌క్వార్టర్స్, వారి కార్యకలాపాలు ఎప్పుడూ అత్యంత చురుగ్గా ఉంటాయి. సముద్రంలో ఎవరైనా మత్స్యకారులు ఆపదలో ఉంటే, తుఫానుల్లో చిక్కుకుంటే కాపాడటం , సముద్రం ద్వారా జరిగే గోల్డ్ స్మగ్లింగ్, డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడం వీరి ప్రధాన బాధ్యతలు. ఈ హోవర్క్రాఫ్ట్లపై అత్యాధునిక రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, నైట్ విజన్ కెమెరాలు, హెవీ మెషిన్ గన్స్ అమర్చి ఉంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, శత్రువులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం నిమిషాల వ్యవధిలో తీరం నుంచి సముద్రంలోకి దూసుకెళ్లే సత్తా వీటికి ఉంది. ఇప్పుడు రుషికొండలో వాతావరణం వల్ల ఆగిన క్రాఫ్ట్ లు కూడా ఈ రెగ్యులర్ భద్రతా విధుల్లో భాగమైనవే తప్ప, ఎలాంటి ఎటాక్ జరగలేదని డిఫెన్స్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. రుషికొండ బీచ్ లో వాతావరణం కారణంగా హోవర్‌క్రాఫ్ట్‌లు ఆగినప్పటికీ.. ఇది స్థానికులకు, పర్యాటకులకు మన దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో, వారి దగ్గర ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ ఉందో ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించింది.



