విజయవాడ నుండి మరో గ్రాండ్ మాస్టర్…జర్మనీ, స్పెయిన్ టోర్నమెంట్స్ లో ఛాంపియన్

విజయవాడకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఎమ్. ఆర్. లలిత్ బాబు, జర్మనీలో జరిగిన 43వ మున్స్టర్లాండ్ ఓపెన్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. తన నైపుణ్యం మరియు పట్టుదలతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఈ విజయాన్ని సాధించడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. లలిత్ బాబు విజయం ఎంతో మంది యవ క్రీడాకారులకు వారి కలలను నెరవేర్చుకోవడానికి స్ఫూర్తినిస్తుందని కొనియాడుతున్నారు. ముందుముందు మీరు మరెన్నో విజయాలు సాధించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియూ భారతీయ చెస్ కి ఇది ఒక గర్వకారణమైన క్షణమని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చెస్ రంగంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక మంది చెస్ క్రీడాకారులను దేశానికి అందించిన ఈ నగర కీర్తి కిరీటంలో మరో మెరిసే రత్నం చేరింది. విజయవాడకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు, గ్రాండ్ మాస్టర్ ఎమ్. ఆర్. లలిత్ బాబు అంతర్జాతీయ స్థాయిలో భారత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ పేరును ప్రకాశింపజేశారు. ఆయన సాధించిన ఇటీవలి విజయం రాష్ట్ర క్రీడా రంగానికి నూతనోత్తేజాన్ని ఇచ్చింది.
జర్మనీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 43వ మున్స్టర్లాండ్ ఓపెన్ 2026 చెస్ టోర్నమెంట్లో లలిత్ బాబు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మేటి క్రీడాకారులతో హోరాహోరీగా సాగిన ఈ పోటీలలో తన వ్యూహాత్మక చతురతతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. చివరి వరకు టోర్నీపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆయన మున్స్టర్లాండ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచారు. అలాగే తాజాగా స్పెయిన్‌లో జరిగిన బెనిడోర్మ్ చెస్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో 'ఓపెన్ ఎ' విభాగంలో సత్తాచాటారు. ఆయన మొత్తం 9 రౌండ్లలో 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంతో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతమైన ఫామ్ తో విజేతగా నిలిచారు. ఈ విజయం లలిత్ బాబు యొక్క అపారమైన నైపుణ్యం, చెస్ పట్ల ఆయనకున్న పట్టుదల మరియు కఠిన శ్రమకు నిదర్శనం. మైండ్ గేమ్‌గా పిలవబడే చెస్‌లో ఒత్తిడిని జయించి, ప్రతి ఎత్తునూ ఎంతో నిశితంగా పరిశీలిస్తూ ఆయన సాగించిన విజయయాత్ర అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక గెలుపుతో అంతర్జాతీయంగా మరోసారి తన సత్తాను చాటుకున్నారు.ఈ చారిత్రాత్మక విజయం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా మొత్తం భారతీయ చెస్ రంగానికి ఎంతో గర్వకారణమైన క్షణంగా నిలిచింది. భవిష్యత్తులో లలిత్ బాబు మరింతగా రాణించి, మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లను కైవసం చేసుకోవాలని, దేశానికి మరిన్ని గొప్ప విజయాలు అందించాలని రాష్ట్రప్రజలు మరియు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
వీడియో
YouTube వీడియో



