సాక్షిగా పిలుపు…బెంగాల్ మాజీ సీఎం మమతకు ఢిల్లీ పోలీసుల నోటీసులు

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఏదో రీసెంట్గా జరిగిన కేసులో కాదు, ఏకంగా 13 ఏళ్ల క్రితం అంటే 2013లో నమోదైన ఒక పాత కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మమతా బెనర్జీకి తాజాగా నోటీసులు జారీ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక జాతీయ పార్టీ అధినేత్రికి పోలీసులు ఇలా పాత కేసులో నోటీసులు ఇవ్వడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
2013లో ఢిల్లీలోని అప్పటి ప్రణాళికా సంఘం కార్యాలయం వద్ద లెఫ్ట్ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఎఫ్ఐ నేత సుదీప్తో గుప్తా మృతికి నిరసనగా వారు ఆ ఆందోళన చేశారు. సరిగ్గా అదే సమయంలో మమతా బెనర్జీ తన పార్టీ నేతలు, మంత్రులతో కలిసి ఒక సమావేశం కోసం అక్కడికి వెళ్లారు. మమతా బెనర్జీ కారు దిగగానే.. ఆగ్రహంతో ఉన్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆమె బృందాన్ని నలువైపులా చుట్టుముట్టారు. గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తోపులాటలో అప్పటి బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాపై కొందరు నిరసనకారులు భౌతికంగా దాడి చేసి, అత్యంత దురుసుగా ప్రవర్తించారు. ఆయన చొక్కా చిరిగిపోవడం అప్పట్లో జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఎఫ్ఐ నేతలపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ దాడి జరిగి పుష్కర కాలం దాటినా.. ఆ కేసు విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
అయితే ఢిల్లీ పోలీసులు మమతా బెనర్జీకి నోటీసులు ఇచ్చింది ముద్దాయిగా కాదు, ఒక సాక్షిగా మాత్రమే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీ పోలీస్ అధికారులు ఈ నోటీసులను జారీ చేశారు. సెక్షన్ 160 ప్రకారం, ఏదైనా కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు, ఆ కేసుకు సంబంధించిన పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తులను విచారించి, వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అందుకే ఈ కేసులో మమత పాత్రపై, ఆరోజు జరిగిన దాడిపై మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాలని భావిస్తున్నారు. ఈ నోటీసుల్లో పోలీసులు ఒక ఆసక్తికరమైన వెసులుబాటు కూడా కల్పించారు. మమతా బెనర్జీ మాజీ సీఎం, విఐపీ కావడంతో.. విచారణాధికారిని ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? అన్నది ఆమె తన సౌకర్యానుసారం నిర్ణయించుకోవచ్చని పోలీసులు ఆ నోటీసులో స్పష్టంగా సూచించారు. దీన్ని బట్టి చూస్తే, ఈ కేసును దర్యాప్తు అధికారులు ఇప్పుడు ఒక లాజికల్ ఎండ్‌కు తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.



