సెన్సార్ బోర్డ్ నయా రూల్స్..ప్రొడ్యూసర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రిలీజ్ తేదీల సాకుతో తమపై ఒత్తిడి తెస్తే కుదరదని చెప్పేసింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు కఠిన మార్గదర్శకాలతో కూడిన ఒక అడ్వైజరీని విడుదల చేశారు. భారత్ లో ఏ భాషా చిత్రమైనా సరే, థియేటర్లలో రిలీజ్ కావాలంటే కచ్చితంగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. అయితే నిర్మాతలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి, ఆ టెన్షన్ ను బోర్డ్ అధికారుల మీదకు నెట్టేస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన బోర్డు ఒక అడ్వైజరీ జారీ చేసింది. సినిమా లేదా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించామని, త్వరగా సెన్సార్ పూర్తి చేయాలని కోరడానికి వీల్లేదని బోర్డు తేల్చి చెప్పింది. నిర్మాత ఏ తేదీని ప్రకటించుకున్నా, థియేటర్లు బుక్ చేసుకున్నా బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. చట్టబద్ధమైన గడువులు, నిబంధనల ప్రకారమే సెన్సార్ కమిటీ తగిన సమయం తీసుకుని ప్రశాంతంగా సినిమాను రివ్యూ చేస్తుందని స్పష్టం చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 , తాజా 2024 రూల్స్ కు లోబడి, తమ సినిమా విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని ప్రొడ్యూసర్లు ముందుగానే అంటే..కనీసం నెల రోజుల ముందు సెన్సార్ కు అప్లై చేసుకోవాలని బోర్డు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై రిలీజ్ డేట్ కార్డు వాడితే సెన్సార్ బోర్డ్ కనికరించే ప్రసక్తే లేదు. సెన్సార్ బోర్డ్ నిర్మాతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సెన్సార్ కు అప్లై చేయాలంటే సినిమా కాపీ ఏ కండిషన్ లో ఉండాలో క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనల ప్రకారం.. సినిమా ఫైనల్ గ్రాఫిక్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సినిమా ఎండ్ క్రెడిట్స్, సౌండ్ మిక్సింగ్, సబ్ టైటిల్స్ అన్నీ పూర్తిగా 100 శాతం రెడీ అయిన తర్వాతే సెన్సార్ కు దరఖాస్తు చేసుకోవాలి. థియేటర్లో ప్రేక్షకులు ఏ ఫైనల్ అవుట్ పుట్ అయితే చూస్తారో, సెన్సార్ బోర్డ్ కు కూడా అదే ఫైనల్ అవుట్ పుట్ సబ్మిట్ చేయాలి. అలా కాకుండా అసంపూర్తిగా ఉన్న ప్రింట్లు ఇస్తే.. ఆ అప్లికేషన్ ను ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తిరస్కరిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇక సినిమాల టైటిల్స్ విషయంలో కూడా బోర్డు సీరియస్ అయింది. కేవలం సెన్సార్ అప్లికేషన్ లో సినిమా పేరు పెట్టినంత మాత్రాన ఆ టైటిల్ కు ఆమోదం లభించినట్లు కాదని బోర్డు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒక సినిమా టైటిల్ ను మార్చే పూర్తి అధికారం సెన్సార్ ఎగ్జామినింగ్ కమిటీకి ఉంటుంది. కాబట్టి, సెన్సార్ సర్టిఫికెట్ రాకముందే అదే ఫైనల్ టైటిల్ అని నిర్మాతలు పోస్టర్లపై అఫీషియల్ గా ప్రచారం చేయకూడదని సూచించింది. ఏవైనా వివాదాస్పద టైటిల్స్ ఉంటే మార్చక తప్పదు అని పరోక్షంగా హింట్ ఇచ్చింది. సాధారణంగా మన టాలీవుడ్, బాలీవుడ్ లో చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తూ, రిలీజ్ కు ముందు రోజు రాత్రి వరకు హార్డ్ డిస్క్ లతో థియేటర్ల చుట్టూ పరుగెత్తే మేకర్స్ చాలా మంది ఉన్నారు. ఇక మీదట పక్కాగా మొత్తం ప్లాన్ చేసుకుంటేనే సినిమా రిలీజ్ అవుతుంది.



