రూటు మార్చిన పీపుల్స్ స్టార్..?

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నాలుగు దశాబ్దాలుగా ప్రజా సమస్యల నేపథ్యంతోనే సినిమాలు తీస్తూ.. అటు నిర్మాతగా, ఇటు దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తన నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీలేని పోరాటం చేస్తూ, గతంలో అగ్ర దర్శకులు బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేసినా సరే, కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి సున్నితంగా నో చెప్పిన చరిత్ర ఆయనది. అలాంటి సిద్ధాంతాల నాయకుడు, పక్కా కమర్షియల్ సినిమాలకు ఆమడదూరంలో ఉండే ఆర్. నారాయణమూర్తి ఇప్పుడు తీసుకున్న ఒక తాజా నిర్ణయం టాలీవుడ్లో అతిపెద్ద సంచలనంగా మారింది.
కొన్నేళ్ల క్రితం శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన హుషారు సినిమా యూత్ కి ఎంత బాగా కనెక్ట్ అయిందో మనందరికీ తెలుసు. అందులో ఉండిపోరాదే సాంగ్ అయితే ఒక సెన్సేషన్. ఇప్పుడు ఆ హిట్ సినిమాకు సీక్వెల్ గా హుషారు 2 తెరకెక్కుతోంది. ఇది పక్కా జాలీ, యూత్ ఫుల్, రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలో ఆర్. నారాయణమూర్తి నటిస్తున్నారు అనగానే అందరి మైండ్ బ్లాంక్ అయింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఆయన ఆషామాషీ క్యారెక్టర్ చేయడం లేదు. ఒక పవర్ ఫుల్ నక్సలైట్ స్పెషల్ రోల్ లో ఆయన కనిపించబోతున్నారట. కుర్రాళ్ల జీవితాల్లోకి అనుకోకుండా ఒక నక్సలైట్ వస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు, ఫన్, ఎమోషన్ చుట్టూ ఆయన ట్రాక్ నడవనుందని తెలుస్తోంది. క్యారెక్టర్ నక్సలైట్ దే అయినా.. సినిమా జానర్ మాత్రం పూర్తి కమర్షియల్ యూత్ ఎంటర్టైనర్ కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. దశాబ్దాలుగా ఇతరుల దర్శకత్వంలో నటించడానికి ససేమిరా అన్న ఆయన, ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ చెప్పిన కథకు, అందులోని తన క్యారెక్టర్ కు ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పడం టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ కు ఎంత పేరు వచ్చిందో, అందులో హోంగార్డు నారాయణమూర్తి పాత్రకు కూడా అంతే పేరు వచ్చింది. ఆ పాత్రలో పోసాని కృష్ణమురళి నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సార్.. మీరు మారిపోయారు సార్ అని పోసాని చెప్పే డైలాగ్ ఎప్పటికీ ఐకానిక్. అయితే ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే.. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ హోంగార్డు పాత్రను రాసుకున్నదే ఆర్. నారాయణమూర్తి కోసం. ఆ క్యారెక్టర్ పేరు కూడా అందుకే నారాయణమూర్తి అని పెట్టారు. ఆ పాత్ర కోసం పూరి స్వయంగా వెళ్లి ఆయనను సంప్రదించారు. కానీ నారాయణమూర్తి అప్పుడు ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. ఆరోజు టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ ను, అంతటి ఎమోషనల్ క్యారెక్టర్ ను వద్దనుకున్న ఆయన.. ఈరోజు పూర్తి జాలీ యూత్ ఎంటర్టైనర్ అయిన హుషారు 2 లో నటించడానికి ఎలా ఒప్పుకున్నారంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు టెంపర్ సినిమాలో పోసాని చెప్పిన ఫేమస్ డైలాగ్‌నే ఇప్పుడు నారాయణమూర్తికి ఆపాదిస్తూ.. మూర్తి గారూ మీరు మారిపోయారు సార్ అంటూ నెట్టింట ఫన్నీగా, ఎమోషనల్ గా కామెంట్ల వర్షం కురిపిస్తుండటం విశేషం. ఎప్పుడూ రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే పీపుల్స్ స్టార్.. ఇప్పుడు వెండితెరపై యువతరంతో కలిసి సందడి చేయడానికి రావడం కచ్చితంగా స్వాగతించదగ్గ పరిణామం. ఒక నటుడిగా ఆయనకు ఇది కచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని అంటున్నారు.



