కూతురికి కిమ్ ట్రైనింగ్ ..తొలిసారి ఒక మహిళకు పాలనా పగ్గాలు..?

ఉత్తర కొరియా ప్రపంచంలో ఈ దేశం దారే ప్రత్యేకం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక గిరి గీసుకుని బతుకుతున్న దేశం. 1948లో ఆ దేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ మూడు తరాలుగా ఒకే కుటుంబం అక్కడ నియంతృత్వ పాలన సాగిస్తోంది. కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్, ఆ తర్వాత ప్రస్తుత సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. ఈ ముగ్గురూ తమ దేశాన్ని ఏలుతున్నారు. అయితే, ఇప్పుడు ఆ నియంతృత్వ సామ్రాజ్యంలో ఒక ఊహించని, చారిత్రక పరిణామం జరగబోతోందనేది ఆశ్చర్యపరుస్తోంది. తొలిసారి ఒక మహిళకు పాలనా పగ్గాలు అప్పగించనున్నారా? దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దిశగా సీక్రెట్‌గా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అది కూడా ఎవరో సామాన్య పౌరులు కాదు, ప్రాణ భయంతో ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చిన శరణార్థులు ఈ సంచలన నిజాన్ని బయటపెట్టారు. కిమ్ తన తదనంతరం వారసురాలిగా తన సొంత కూతురు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు-ఏ ని సిద్ధం చేస్తుండటం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
దక్షిణ కొరియా నిఘా వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం, కిమ్ గత నాలుగేళ్లుగా తన కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే, మరోపక్క దేశంలోని అత్యంత కీలకమైన మిలిటరీ ఈవెంట్స్‌కు వెంటబెట్టుకుని వెళ్తున్నారు. అత్యంత శక్తివంతమైన హ్వాసాంగ్-17 మిస్సైల్ టెస్ట్ దగ్గర నుంచి, భయంకరమైన సైనిక కవాతుల వరకు.. కిమ్ జోంగ్ ఉన్ పక్కన బ్లాక్ కలర్ మిలిటరీ కోట్ వేసుకుని గంభీరంగా నిలబడుతోంది కిమ్ జు-ఏ. మొదట్లో ఇది కేవలం ఒక తండ్రికి తన కూతురి మీద ఉన్న ప్రేమ అని ప్రపంచం భావించింది. కానీ, ఉత్తర కొరియాలో ఒక సుప్రీం లీడర్ తన ఫ్యామిలీ మెంబర్స్‌ను ఎప్పుడూ పబ్లిక్‌లోకి తీసుకురాడు. అలాంటిది ఏకంగా మిలిటరీ ఈవెంట్స్‌కు కూతురిని తీసుకెళ్తున్నాడు అంటే.. ఇది భావి నాయకురాలిగా ఆమెను తీర్చిదిద్దే వ్యూహంలో భాగమేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి.ఉత్తర కొరియా లాంటి అత్యంత సంప్రదాయ, పితృస్వామ్య దేశంలో ఒక మహిళను దేశాధినేతగా అంగీకరిస్తారా? అనేది చూడాలి. ఉత్తర కొరియాను పాలించే అధికార వర్కర్స్ పార్టీ లో మొత్తం 17 కీలక విభాగాలు ఉన్నాయి. ఆ 17 విభాగాల్లో కేవలం ఒకే ఒక్క మహిళ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమే కిమ్ జోంగ్ ఉన్ సొంత సోదరి కిమ్ యో జోంగ్ . కిమ్ సోదరి ఎంత పవర్ఫుల్ అంటే, ఆమె కనుసన్నలు లేకుండా కిమ్ జోంగ్ ఉన్ ఏ ఫైల్ కూడా కదపరు అని చెబుతారు. అమెరికా, దక్షిణ కొరియాలకు స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చేది కూడా ఆమెనే. అయితే కిమ్ తర్వాత ఆమెనే వారసురాలు అని ప్రపంచం భావిస్తున్న తరుణంలో.. కిమ్ ఊహించని విధంగా తన 13 ఏళ్ల కూతురిని రంగంలోకి దించాడు. ఒక చిన్నారిని, అందులోనూ ఒక ఆడపిల్లను సుప్రీం లీడర్‌గా అంగీకరించడం ఆ దేశ మిలిటరీలోని సీనియర్లకు మింగుడుపడటం లేదని, తీవ్రమైన అంతర్గత సంఘర్షణ నడుస్తోందని దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చిన కొందరు శరణార్థులు విశ్లేషిస్తున్నారు.
ఉత్తర కొరియాలో కిమ్ వంశం అనేది ఒక మామూలు రాజకీయ కుటుంబం కాదు. అక్కడ వాళ్లను మనుషులను ఏలే దేవుళ్లుగా భావిస్తారు. ఆ దేశ పునాదులు కిమ్ ఇల్ సంగ్ రక్తంతో ముడిపడి ఉన్నాయని ప్రజల మెదళ్లలో బలంగా నాటేశారు. కాబట్టి అక్కడ పాలకుడు మగవాడా? ఆడదా? అన్న లింగ భేదం పెద్ద సమస్య కాదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటినుంచే తన కూతురిని ప్రజలకు, సైన్యానికి అలవాటు చేస్తున్నాడు. తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే, తన కళ్ల ముందే కూతురికి దేశంలోని కీలకమైన ఆయుధ సంపద , సైనిక స్థావరాల గురించి ట్రైనింగ్ ఇస్తున్నాడు. తద్వారా తన తర్వాత దేశంలో ఎలాంటి తిరుగుబాటు రాకుండా, తన కూతురి చేతిలోనే కమాండ్ ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.



