యాసంగి రైతు భరోసాకు లైన్ క్లియర్..ఆ కండిషన్ బ్రేక్!

తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంపై గత కొద్దిరోజులుగా అనేక అనుమానాలు, ప్రచారాలు జరుగుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో, అందరి దృష్టి ఈ నిధుల విడుదలపైనే పడింది. అయితే, ప్రభుత్వ నిబంధనల వల్ల చాలామంది రైతుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. గతంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన కండిషన్ పెట్టింది.. కేవలం పంట సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తాం.. పడావు పెట్టిన భూములకు ఇవ్వం అని తేల్చిచెప్పింది. కానీ ఈ ఏడాది పరిస్థితి వేరు. వాతావరణం అనుకూలించలేదు, వర్షాలు పడలేదు. ఈ క్రమంలో, తమ ప్రమేయం లేకుండానే ఎల్ నినో కరువు వల్ల పంట సాగు చేయలేకపోయిన రైతులు.. ఈ యాసంగి సీజన్లో తమ అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ కాదనే ప్రచారంతో భయాందోళనలకు గురయ్యారు. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన సీఎం రేవంత్ కేబినెట్ సమావేశంలో ఒక రైతు పక్షపాత నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఎల్‌నినో పరిస్థితుల వల్ల పంట సాగు చేపట్టని రైతులకు కూడా ఈ యాసంగి సీజన్లో రైతు భరోసా అందించాలని నిర్ణయించారు. అంటే, ఒక రైతు తన పొలంలో పంట సాగు చేసినా, చేయకపోయినా.. కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ అర్హుడైన లబ్ధిదారుడికి నగదు అందించే దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిబంధనల పేరుతో పెట్టుబడి సాయం కోల్పోతామేమో అని భయపడిన లక్షలాది మంది రైతులకు అతిపెద్ద ఊరట లభించినట్లయింది. ఏ ఒక్క అన్నదాతా నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే సర్కార్ ఈ సడలింపు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
రైతులకు పెట్టుబడి సాయం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగానే నిధులు కేటాయించింది. ఎకరానికి ఏటా రూ.12 వేల చొప్పున సీజన్‌కు రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తోంది. గత వానాకాలం సీజన్ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా కోటి 48 లక్షల ఎకరాలకు గాను ఏకంగా రూ.8,759 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ భారీ నిధుల విడుదల వల్ల రాష్ట్రంలో సుమారు 70 లక్షల 40వేల మంది రైతులు లబ్ధి పొందారు. ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా నిబంధనలు సడలించడంతో, తిరిగి అదే స్థాయిలో 70 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ సాగు చేసిన భూములకే ఇస్తామని ప్రభుత్వం మొండికేసి ఉంటే.. లక్షలాది మంది రైతులు ఈ సీజన్లో పెట్టుబడి సాయం కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడేవారు. ఈ సాయం ఇప్పుడు వారి రోజువారీ అవసరాలకు , రాబోయే వ్యవసాయ పనులకు ఎంతో అండగా నిలవనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదల కోసం ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గత వానాకాలం సీజన్లో అవలంబించిన విధానాన్నే ఈసారి కూడా పాటించే అవకాశం ఉంది. అంటే, ఒకట్రెండు ఎకరాలు ఉన్న చిన్న, సన్నకారు రైతుల అకౌంట్లలో ముందుగా డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత దశలవారీగా పెద్ద రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిధులు బదిలీ అవుతాయి. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా వ్యవసాయ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా కరువు కాలంలో రైతుల కష్టాన్ని గుర్తించి, వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.రైతులకు పంట సాగు చేయకున్నా పెట్టుబడి సాయం ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం.. వారిలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.



