వివాదంలో కమల్ కొత్త సినిమా టైటిల్…అసలు ‘సండియర్’ అంటే ఏంటి?

దిగ్గజ నటుడు కమల్ నటిస్తున్న తాజా మూవీ సండియర్ వివాదంలో చిక్కుంది. ఈ పేరు పై తమిళనాడులో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. తమిళ భాషలో సండియర్ అనే పదానికి రౌడీ, వీధి పోకిరి, గొడవలు సృష్టించేవాడు అనే అర్థం ఉంది. అయితే దక్షిణ తమిళనాడులోని కొన్ని ఆధిపత్య కులాలు తమ ఆధిపత్యాన్ని, శౌర్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ పదాన్ని గర్వకారణంగా వాడుకుంటాయి. ఒక పౌరుషం ఉన్న హీరోగా ఈ పదాన్ని కీర్తిస్తారు. అయితే, దళితుల హక్కుల కోసం పోరాడే నాయకులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో కుల ఘర్షణలు చాలా సున్నితమైన అంశం. ఇలాంటి టైటిల్ పెడితే ఒక వర్గం వారిని కించపరిచినట్లు అవుతుందని, వారి పౌరుషాన్ని రెచ్చగొట్టి మళ్లీ కుల ఘర్షణలకు, హింసకు దారితీస్తుందని పుతియా తమిళగం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. కృష్ణస్వామి ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా టైటిల్ కింద ప్రతీకారం రక్తంతోనే తీరుతుంది అనే రెచ్చగొట్టే ట్యాగ్‌లైన్ ఉండటం ఈ అగ్నికి ఆజ్యం పోస్తోంది. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి టైటిల్‌కు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇస్తుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ పెట్టిన ఈ సండియర్ టైటిల్ వెనుక ఒక పెద్ద ఫ్లాష్‌బ్యాక్ ఉంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం, అంటే 2003లో కమల్ హాసన్ ఒక సినిమా అనౌన్స్ చేశారు. అప్పట్లో కొడవలి పట్టుకున్న కమల్ పోస్టర్‌ను సండియర్ అనే టైటిల్‌తోనే రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఇదే డాక్టర్ కృష్ణస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టైటిల్ మార్చకపోతే సినిమా షూటింగ్‌ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆ పోస్టర్ దక్షిణ తమిళనాడులో తీవ్ర కుల ఉద్రిక్తతలకు దారితీసింది. లా అండ్ ఆర్డర్ సమస్యగా మారడంతో, అప్పటి ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకున్నారు. టైటిల్ మార్చాలని ఆమె కమల్ హాసన్‌కు సూచించారు. టైటిల్ మార్చడం ఇష్టం లేకపోయినా, ఈ సినిమా ఏ పేరుతో వచ్చినా హిట్ అవుతుంది అని చెప్పి, ఆ సినిమా పేరును కమల్ హాసన్ విరుమాండి గా మార్చారు. 2004లో వచ్చిన విరుమాండి కల్ట్ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే అప్పుడు వదిలేసిన ఆ సండియర్ టైటిల్‌ను, 23 ఏళ్ల తర్వాత తీశారు. ఈ టైటిల్ వ్యవహారంలో తమిళ సినీ ఇండస్ట్రీ కూడా రెండుగా విడిపోయింది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ లెనిన్ భారతి కూడా ఈ టైటిల్ ఎంపికను విమర్శించారు. రక్తంతో ప్రతీకారం తీర్చుకోవడం లాంటి ట్యాగ్లైన్లు హింసను కీర్తిస్తున్నాయని, ఇది సమాజంపై, ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వాదిస్తున్నారు. ఒక సీనియర్ నటుడిగా ఉన్న కమల్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. అయితే, మరోవైపు ప్రముఖ దర్శకుడు అమీర్, కమల్ హాసన్‌కు మద్దతుగా నిలిచారు. సినిమాల మీద ఈ పాలిటిక్స్ ఆపాలని ఆయన డాక్టర్ కృష్ణస్వామికి కౌంటర్ ఇచ్చారు. 2014లో ఏమాత్రం పేరున్న నటులు లేకుండా, ముక్కుముఖం తెలియని వాళ్లతో ఇదే సండియర్ అనే టైటిల్‌తో ఒక చిన్న సినిమా వచ్చింది, అప్పుడు ఎవరూ కులవివాదం గురించి మాట్లాడలేదు, ఎవరూ అడ్డుకోలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్ హీరో ఆ టైటిల్ పెట్టగానే అందరికీ సామాజిక బాధ్యత గుర్తుకు వస్తోందని, ఇదంతా కేవలం పబ్లిసిటీ , రాజకీయ స్టంట్ మాత్రమేనని అమీర్ ఘాటుగా విమర్శించారు.



