వేల కోట్ల వారసుడికి తండ్రి పెట్టిన పరీక్ష..ఈ తండ్రి ప్లాన్ చూస్తే సలాం కొట్టాల్సిందే!

ఏకంగా రూ.6000 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి కూడా, తన కన్న కొడుకుని ఎవరికీ తెలియని ఒక కొత్త సిటీలో అనాథలా వదిలేశాడు. జేబులో కనీసం తినడానికి డబ్బులు లేక, ఫోన్ లేక అతను నరకం అనుభవించాడు. అయితే ఈ తండ్రి ఒక సాధారణ వ్యాపారవేత్త కాదు. ఓ డైమండ్ కింగ్. దీపావళి వస్తే తన కంపెనీలో పనిచేసే కార్మికులకు వందల కొద్దీ కార్లు, ఫ్లాట్లు, డైమండ్స్ బోనస్ గా ఇచ్చే హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ సంస్థ ఫౌండర్లలో ఒకరైన ఘన్శ్యామ్ ధోలాకియా. తన 23 ఏళ్ల కొడుకు హితార్త్ ధోలాకియాను అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించాడు. అమెరికా నుంచి రాగానే ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి వేల కోట్ల కంపెనీకి సీఈఓను చేయలేదు. తన చేతిలో కేవలం 500 రూపాయలు పెట్టి ఎలా బ్రతకాలో చెప్పాడు. అసలు విషయం ఏమిటంటే హితార్త్ ధోలాకియా.. హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ యజమాని ఘన్శ్యామ్ ధోలాకియా కొడుకు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశాడు. న్యూయార్క్ వీధుల్లో లగ్జరీ కార్లు, పబ్బులు, పార్టీలు, ఖరీదైన బ్రాండ్స్.. ఇలా ఏ లోటూ లేకుండా పెరిగాడు. చదువు పూర్తయ్యాక 2017 జూన్ లో గుజరాత్ లోని సూరత్ కు తిరిగి వచ్చాడు. తాను తిరిగి రాగానే తండ్రి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలలేదు. ఘన్శ్యామ్ ధోలాకియా మైండ్ సెట్ వేరు. ఆ కుటుంబంలో ఒక రూల్ ఉంది. విదేశాల్లో చదువుకుని రాగానే, ఆ విలాసాలన్నీ మర్చిపోయి, గ్రౌండ్ లెవెల్ లో జీవితం అంటే ఏంటో నేర్చుకోవాలి. తండ్రి హితార్త్ ను పిలిచి, ఒక నెల రోజుల పాటు ఇంటికి దూరంగా, ఎవరికీ తెలియని నగరంలో బతకాలి. నీ దగ్గర ఫోన్ ఉండకూడదు. ఇంట్లోంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లకూడదు. నేను కేవలం 500 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బుతోనే నువ్వు ఉండటానికి ఇల్లు వెతుక్కోవాలి, ఉద్యోగం సంపాదించాలి. నీ ఐడెంటిటీ, ధోలాకియా అనే నీ ఇంటిపేరు ఎక్కడా వాడకూడదు. ఒక ఉద్యోగం వారం కంటే ఎక్కువ చేయకూడదు. అలా నాలుగు వారాల్లో కనీసం నాలుగు ఉద్యోగాలు చేసి, నీ సొంత కాళ్ల మీద బతికి చూపించు అని చెప్పాడు.



